HomeTelugu Big Storiesజీవితాల్ని చిత్తు చేసే మత్తు అవసరమా?

జీవితాల్ని చిత్తు చేసే మత్తు అవసరమా?

12 14
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీసు శాఖ యువతను ఉద్దేశించి ట్విటర్‌లో ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దని కోరింది. దాంతో పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమ ప్రచారంలో భాగంగా నిర్వహించిన వెబినార్‌లో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి పాల్గొన్నారు. అలాగే మాదకద్రవ్యాలకు అలవాటు పడొద్దంటూ హీరో నాని, సాయి ధరమ్‌తేజ్‌.. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడిన వీడియోలను ఏపీ పోలీస్‌ శాఖ ట్విటర్‌లో పెట్టింది.

”ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్‌కు బానిసై బంగారంలాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటోంది. ఎన్నో జన్మల పుణ్యఫలం మనిషి జన్మ. ఇంత అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్థవ్యస్థం చేసుకోవడం అవసరమా? క్షణికానందం కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో యువత డ్రగ్స్‌కు బానిస కావడం చూస్తుంటే మనసు కలిచివేస్తోంది. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు. ఎంతో అందమైన ఈ మనిషి జన్మకు ఒక లక్ష్యమంటూ ఉండాలి. అది సాధించడానికి నిరంతరం తపన పడుతూ ఉండాలి. అంతేగానీ జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు. జీవితాల్ని చిత్తు చేసే ఈ మత్తు మనకు అవసరమా? మనిషిపై ఆధారపడే కుటుంబం వీధిన పడటం సమంజసమా? ఇకనైనా కళ్లు తెరిచి నవ ప్రపంచంవైపు యువత కదలాలి. ఈ దురలవాట్లకు బానిసైపోతుంటే మిమ్మల్ని చూసి మీ కన్నవారు ఎంత మనో వేదనకు గురవుతారో ఒక్కసారి వారి కోణంలో ఆలోచించి చూడండి”అంటూ చిరంజీవి వెబినార్‌లో మాట్లాడారు.

”మీరు ఎదగాలని మీ ఫ్రెండ్స్‌, మీ ఫ్యామిలీ మెంబర్స్‌, మీ చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అయితే మీరు ఎదగకుండా పాతాళంలోకి పడిపోతుంటే చూడాలని ఒకరు ఎదురుచూస్తుంటారు. అదే డ్రగ్స్‌. ఆ డ్రగ్స్‌వైపు మీరు వేసే ఒకేఒక్క తప్పటడుగు మీ చేతుల్లోని జీవితంపై ఉన్న నియంత్రణను మొత్తం లాగేసుకుంటుంది. కంట్రోలంతా దాని చేతుల్లోకి వెళ్లిపోతుంది. మిమ్మల్ని డ్రగ్స్‌కు బానిసలుగా చేసి మీ నుంచి డబ్బు సంపాదించాలనుకున్న మాఫియాలు, బ్లాక్‌మార్కెట్లు చాలానే ఉన్నాయి. అవన్నీ ఒకవైపు.. వాటన్నింటి నుంచి మిమ్మల్ని కాపాడాలని కష్టపడుతున్న వేలాది పోలీసులు ఒకవైపు. మీరేవైపు?వాళ్లు చీకటితో చేస్తున్న యుద్ధంలో మనం కూడా పాల్గొందాం. వారికి కొంచెం సాయం చేద్దాం. మీకేమైనా సమాచారం తెలిస్తే.. స్నేహితుల ద్వారా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ పేర్లు కూడా వారు బయటకు రానివ్వరు. లెట్స్‌ ఫైట్‌ దిస్‌.. లెట్స్‌ ఫైట్‌ టుగెదర్‌.. లెట్స్‌ ఫైట్‌ డార్క్‌నెస్‌. జైహింద్‌” అని నేచురల్‌ స్టార్‌ నాని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu