
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన హీరోగానే కాకుండా.. ‘చిరంజీవి ఛారిటబుల్’ ట్రస్ట్‌ను ను స్థాపించి కోట్లాదిమందికి సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న (1998) గాంధీ జయంతి సందర్భంగా ఆయన సేవలను, స్పూర్తిని గుర్తు చేసుకుంటూ.. సరిగ్గా 25 ఏండ్ల క్రితం ట్రస్ట్‌ను ప్రారంభించాడు.
ప్రధానంగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌లోని బ్లడ్ బ్యాంక్ లక్షలాది మందికి ప్రాణదానం చేసింది. లక్షలాది మందికి భరోసానిస్తూ విజయవంతంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటోంది. ఈ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. ట్వీట్ పెట్టాడు చిరు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సిసిటి) గౌరవప్రదమైన ప్రారంభం, 25 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను.
ట్రస్ట్ ద్వారా 10 లక్షలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి నిరుపేదలకు పంపిణీ చేశారు. 10 వేల మందికి పైగా కంటి చూపు మెరుగయ్యేలా చేయడం జరిగింది. కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో వేలాది మంది ప్రాణాలు రక్షించబడటంతోపాటు ఇంకా మరెన్నో సేవలందించబడ్డాయి. మన తోటి మనుషులకు ఈ సేవలు అందించడం ద్వారా మనం పొందే సంతృప్తి అసమానమైనది, అమూల్యమైనది.
CCT మానవతా కార్యక్రమాలను శక్తివంతం చేసి, మా సామూహిక మిషన్‌కు శక్తినిస్తున్న లక్షలాది మంది సోదరసోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను. ఇది మన గొప్ప దేశానికి మనమంతా చేస్తున్న చిన్న ఉపకారం. ఇది మహాత్ముడికి మనమంతా అర్పించే నివాళి.. అంటూ సందేశాన్ని పోస్ట్ చేశాడు చిరంజీవి. అప్పటి ట్రస్ట్ ఫొటోతోపాటు తాను రక్తదానం చేస్తున్న స్టిల్‌ను చిరంజీవి ట్వీట్ చేయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.













