చిరు నెక్స్ట్ సినిమా ‘మహావీర’!

మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ లో రెడ్డి అనే కులాన్ని ప్రస్తావించడం పట్ల కొందరు రాజకీయ ప్రముఖులు చిరంజీవితో చర్చించినట్లు తెలుస్తోంది. రెడ్డి అనే పదం లేని టైటిల్ ను తీసుకుంటే మంచిందని సూచించారట. దీంతో చిరంజీవి ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలతో పాటు మలయాళం, హిందీ భాషల్లోకి అనువదించాలనుకుంటున్నారు. 
కాబట్టి అన్ని భాషలకు సరిపడే టైటిల్ ఉంటే మంచిదని భావిస్తున్నారు. కాబట్టి ముందే యూనివర్సల్ అప్పీల్ ఉన్న టైటిల్ ను పెడితే బావుంటుందని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ‘మహావీర’ అనే టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ ఈ టైటిల్ ను తన బ్యానర్ కోసం రిజిస్టర్ చేయించబోతున్నట్లు సమాచారం. ఆగస్ట్ 15న ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. సెప్టెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.