HomeTelugu Newsకరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

13 8
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం అయ్యింది. ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన 3 గంటలపాటు కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ ఉదయం కరోనాపై ఉన్నతాధికారుల కమిటీ సమావేశమై చర్చించారు. కరోనాను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

కరోనా మన దేశంలో పుట్టిన వ్యాధి కాదు. ఎక్కడో చైనా దేశంలో పుట్టి వ్యాపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే తప్ప, ఇక్కడ ఉన్నవారిని ఎవరికీ వ్యాధి సోకలేదు.భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. ఇతర దేశాల పర్యటనకు వెళ్లిన బెంగళూరు వ్యక్తికి వ్యాధి సోకడంతో అతనికి మన వైద్యులు చికిత్స చేశారు. అతను పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్‌ కూడా చేశామని చెప్పారు. ఇప్పటి వరకు మన దేశంలో 83 మందికి ఈ వ్యాధికి సోకిందని, ఇందులో 66 మంది భారతీయులు, 17 మంది విదేశీయులు ఉన్నారని అన్నారు. ఇందులో 10 మంది ఇప్పటికే కోలుకున్నారు. ఒక ఇద్దరు మాత్రమే వైరస్‌ ప్రభావంతో మృతి చెందారని తెలిపారు.

130 కోట్ల జనాభాలో 83 మందికి మాత్రమే వ్యాధి సోకింది. వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే. దానికి బయపడాల్సిన పనిలేదు. అది ఒకరి నుంచి మరొకరికి పాకే వైరస్‌ కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మనలను మనం కాపాడుకోవాలంటే ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు పోవద్దని సూచించారు. ఇప్పటికే మన పక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాలు కొన్ని చర్యలు తీసుకున్నాయి. మన ప్రభుత్వం, ఆరోగ్య శాఖ కూడా వైరస్‌ను ఎదుర్కోవడానికి సర్వ సన్నద్దంగా ఉంది. ప్రాథమికంగా దీని కోసం రూ.500 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

విమానాశ్రయంలో 200 మంది ఆరోగ్యశాఖకు చెందిన సిబ్బంది విదేశాల నుంచి వచ్చే వారిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు సిద్ధం కావడం సాధ్యం కాదు కాబట్టి అన్ని జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 321 ఐసీయూ బెడ్స్‌ కూడా సిద్ధంగా ఉంచాం. అన్నీకలిసి 1340 బెడ్స్‌ను రెడీగా పెట్టుకున్నాం. ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు అన్ని బంద్ చేయాలనీ ఆదేశాలు జారీచేసినట్టు కేసీఆర్ పేర్కొన్నారు. మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని అన్నారు. సెలవులు ఇవ్వకుండా విద్యాసంస్థలు నిర్వహిస్తే వాటి అనుమతులు రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ సోషల్‌ వెల్‌ఫేర్‌ హాస్టల్స్‌లో, కాలేజీ హాస్టళ్లలో ఉంటున్న పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యే వరకు వసతి ఉంటుంది. మిగతా విద్యార్థులను ఇంటికి పంపించడం జరుగుతుందని తెలిపారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ప్రత్యేక శానిటరీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆ శాఖ అధికారులకు ఆదేశించామన్నారు.

అలానే జనసమ్మర్దం అధికంగా ఉండే సినిమా థియేటర్లు, పబ్ లు ఇతర జనసమూహాలు ఉండే వాటిని కూడా మార్చి 31 వరకు మూసి ఉంచాలని ఆదేశించారు. అయితే, మాల్స్ తెరిచే ఉంటాయని అన్నారు. పెళ్లి మండపాల విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు మాత్రమే పెళ్లిళ్ల విషయంలో అనుమతి ఉందని, ఆడంబరాలకు పోకుండా లిమిటెడ్ గా బంధువులతో కలిసి పెళ్లి తంతు జరుపుకోవాలని అన్నారు. మార్చి 31 తరువాత జరగబోయే పెళ్లిళ్లకు హాల్స్‌ బుకింగ్‌ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. వీటిని నియంత్రించేందుకు జిల్లా ఎస్పీలకు, కలెక్టర్లకు అధికారాలు ఇచ్చామన్నారు. బహిరంగసభలు, సమావేశాలు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్‌లకు అనుమతి ఇచ్చేది లేదని తెలిపారు. సినిమాహాళ్లు‌, బార్లు, పబ్‌లు బంద్‌ చేస్తున్నాం. రాష్ట్రంలో జరగాల్సిన అన్ని రకాల స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ను రద్దు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యథాతథంగా నడుస్తాయని ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!