వైఎస్‌ జగన్‌కు అభినందనల వెల్లువ

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఫోన్‌ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు వైఎస్‌ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు.

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ అద్భుత విజయం సాధించినందుకు ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘మీ పట్ల ఆంధ్ర ప్రజలు అపారమైన విశ్వాసాన్ని చూపారు. ప్రజలు, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆశిస్తున్నా. మహానేత వైఎస్సార్ కచ్చితంగా గర్వించే రోజు ఇది’ అని ప్రణబ్‌ ఆకాంక్షించారు.

మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు. వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ ద్వారా అభినందించారు. తెలుగు ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.

జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ ముందుగా ట్విటర్‌ వేదికగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలుపుతూ తెలుగులో ట్వీట్‌ చేశారు.