‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి తప్పుకున్న ఎన్టీఆర్‌ హీరోయిన్

యంగ్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆలియా భట్‌, డైసీ ఎడ్గార్‌జోన్స్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అజయ్‌దేవగణ్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఈ చిత్రం నుంచి హీరోయిన్‌ డైసీ ఎడ్గార్‌జోన్స్‌ తప్పుకొన్నారు. ఈ మేరకు చిత్ర బృందం వెల్లడించింది. ‘అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొనసాగలేకపోతున్నారు. ఆమె భవిష్యత్‌ అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాం’ అని చిత్ర బృందం ట్వీట్‌ చేసింది.

మరోపక్క ఈ చిత్ర గుజరాత్‌ షెడ్యూల్‌ను సరైన సమయంలో పూర్తి చేసినట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. ‘ఆటంకాలు ఎదురైనప్పటికీ గుజరాత్‌ షెడ్యూల్‌ను సరైన సమయంలో పూర్తి చేశాం. చిత్రీకరణ సమయంలో ధర్మజ్‌, సిద్ధపూర్‌ ప్రజల ఆదరణ, ఆతిథ్యానికి కృతజ్ఞతలు. ఉగాదికి ఇంటికి వచ్చాం’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణలో భాగంగా కసరత్తులు చేస్తుండగా, హీరోయిన్‌ రామ్‌చరణ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30 సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే.