HomeTelugu Big Storiesదాసరి మరణం సినీపరిశ్రమకు తీరని లోటు!

దాసరి మరణం సినీపరిశ్రమకు తీరని లోటు!

దాసరి నారాయణరావు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దదిక్కుగా, తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడిగా చరిత్రపుటల్లో తనకంటూ ఓ అధ్యయనాన్ని సృష్టించుకున్నారు. దర్శకుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. నటుడిగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు(75) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మరణించారు. 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనకు సొంతం. 
1947 మే 4న పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఆయన జన్మించారు. అత్యధిక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా గిన్నిస్ పుటలకెక్కాడు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు 250కి పైగా చిత్రాలకు సంభాషణ రచయితగా పనిచేశాడు. 53 సినిమాలను స్వయంగా ఆయనే నిర్మించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన సత్తాను చాటారు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాష చిత్రాల్లో నటించిన దాసరి నటనకు గానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. కళాశాలలో చదివే రోజుల్లోనే అనేక నాటక పోటీల్లో కూడా పాల్గొనేవాడు. అనతికాలంలోనే ప్రతిభ గల రంగస్థల నటుడిగా, నాటక రచయితగా గుర్తింపు పొందారు. కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డారు. ఏ దర్శకుడికి లేనంతగా 18 వేలకు పైగా అభిమాన సంఘాలు ఆయన పేరిట ఉండేవి. 
దాసరి సినిమాలు ‘తాతా మనవడు’, ‘స్వర్గం నరకం’, ‘మేఘసందేశం’, మరియు ‘మామగారు’ ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన ”బొబ్బిలి పులి” మరియు ”సర్దార్ పాపారాయుడు” చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.’మామగారు’, ‘సూరిగాడు’ మరియు ‘ఒసేయ్ రాములమ్మా’ చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు. ‘తాతా మనవడు’ సినిమాతో మొదలుపెట్టిన ఆయన దర్శక జీవితం నాలుగు దశాబ్ధాల వరకు కొనసాగింది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన ‘పరమవీరచక్ర’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ‘ఎర్రబస్సు’ సినిమాను రూపొందించారు. ఆ తరువాత నుండి ఆయన సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.
 
1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు అందుకున్నారు. అలానే స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందారు. 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు. 1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందారు. 1986లో తెలుగు సంస్కృతి మరియు తెలుగు చిత్ర రంగంనకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారు. ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందారు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళా సాగర్, శిరోమణి ఇన్స్టిట్యుట్ 
మొదలైనవి. ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగా గెల్చుకున్నారు. 2003 లో సినీమాఅవార్డ్స్ లో ‘లైఫ్ టైమ్ అచ్చీవ్మెంట్’ అవార్డ్ ను కైవసం చేసుకున్నారు. ఇటీవలే ఆయనకు అల్లు రామలింగయ్య పురస్కారాన్ని అందించారు. 
 
సినిమాలతో పాటు రాజకీయంగా కూడా తనదైన ముద్ర వేశారు దాసరి. రాజీవ్ గాంధీ పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్సాహంగా ఎన్నికల ప్రచారాన్ని సాగించారు దాసరి. 1990 దశకంలో ఆయన తెలుగు తల్లి పేరిట రాజకీయ పార్టీను స్థాపించారు. ఆ తరువాత మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. బొగ్గు మరియు గనుల శాఖకు గాను కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు. 
 
నిర్మాతగా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకున్న ఈ దర్శకదిగ్గజం మంగళవారం సాయంత్రం కాలం చేశారు. గత కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. బీపీలో హెచ్చుతగ్గులు, అన్నావాహికకు రంద్రాలు, దాని వల్ల ఇన్‌ఫెక్షన్ సోకడం వంటి ఇన్ఫెక్షన్స్ కారణంగా ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆయన కాస్త కోలుకోగానే డిశ్చార్జ్ చేసి ఇంటి వద్దనే ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారు. వారం క్రితం ఆయన రెండోసారి కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ ఏడాది జనవరి 19న మొదటిసారి ఆసుపత్రిలో చేరారు. మార్చి 29న డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఒకింత ఉత్సాహంగానే కనిపించారు. మళ్లీ ఈ నెల 17న రెండోసారి ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం దాసరికి మరోసారి సర్జరీ జరిగింది. ఇన్‌ఫెక్షన్ సోకిందని, దీంతో ఆందోళనకర పరిస్థితి ఉందని సమాచారం. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటుతో ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. గడిచిన అయిదు నెలల్లో దాసరి నారాయణ రావుకు రెండుసార్లు చికిత్స జరిగింది. తొలిసారి జనవరి 19న ఆసుపత్రిలో చేరారు. అప్పుడు చికిత్స అనంతరం మార్చి 29వ తేదీన ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయనకు అప్పుడు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ చేశారు. 
 
ఆ తర్వాత ఈనెల 4వ తేదీన తన 75వ పుట్టిన రోజును జరుపుకున్నారు. అంతలోనే వారం క్రితం మరోసారి పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. మూడ్రోజుల క్రితం మరోసారి సర్జరీ చేశారని తెలుస్తోంది. కానీ తీవ్ర అనారోగ్యం కారణంగా మంగళవారం సాయంత్రం కిమ్స్ లో ఆయన మరణించినట్లు వైధ్యులు తెలిపారు. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. తెలుగు సినీ పరిశ్రమకి పెద్ద దిక్కుగా నిలిచిన దాసరి మృతితో సినీ పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భాంతికి గురైంది. ఈ దుర్వార్త తెలుసుకున్న ప్రముఖులు ఒక్కొక్కరిగా దాసరి ఇంటికి చేరుకొని తుది నివాళులు అర్పించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu