HomeTelugu Newsనాకు నా పేరంటే అస్సలు ఇష్టంలేదు

నాకు నా పేరంటే అస్సలు ఇష్టంలేదు

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ జీవితాధారంగా రాసిన బయోగ్రఫీ ‘నోట్స్‌ ఆఫ్‌ ఎ డ్రీమ్‌: ది ఆథరైజ్డ్‌ బయోగ్రఫీ ఆఫ్‌ ఏఆర్‌ రెహమాన్‌’ ని శనివారం విడుదల చేశారు. ఈ బయోగ్రఫీని రచయిత కృష్ణ త్రిలోక్‌ రాశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను రెహమాన్‌ పంచుకున్నారు.

9 1

‘నాకు 25 ఏళ్లు వచ్చేవరకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చేవి. ఎవరికి వారు మనం ఎందుకూ పనికిరాము అని అనుకోవడం వల్లే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నా తండ్రిని కోల్పోవడంతో జీవితం శూన్యంగా మారిపోయింది. అదే సమయంలో నా తండ్రి మరణం నాలో భయాన్ని పోగొట్టింది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అలాంటప్పుడు వాటి గురించి ఎందుకు భయపడాలి? మా నాన్న చనిపోయిన సమయంలో నేను సినిమాలకు పనిచేయడం మానేశాను. నాకు 35 సినిమాలకు సంగీతం అందించే అవకాశం వస్తే నేను రెండే చేశాను. చాలా మంది ‘ఎలా జీవిస్తావు? అవకాశాలు వస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి’ అని చెప్పేవారు. అప్పుడు నా వయసు 25. అన్ని అవకాశాలను ఒకేసారి సద్వినియోగం చేసుకోలేను. అలా చేస్తే జీవితానికి సరిపడా తిండిని ఒకేసారి తిన్నట్లు అవుతుంది. అందుకే కొంచెం కొంచెం తింటూ ఆస్వాదించాలనుకున్నాను.’

’12 నుంచి 22 ఏళ్లలోపు నా చదువును పూర్తిచేసేశాను. దాంతో పాటు అందరూ చేసే పనులు చేయకూడదు అనుకున్నాను. అందుకే సంగీతం వైపు వచ్చాను. ‘రోజా’ సినిమాకు సంగీతం అందించే సమయంలో నా కుటుంబం ఇస్లాం మతంలోనికి మారింది. నా అసలు పేరు దిలీప్‌ కుమార్‌. ఇస్లాం మతంలోకి మారాక నా పాత విషయాలన్నీ వదిలేశాను. నాకు నా అసలు పేరంటే అస్సలు ఇష్టంలేదు. ఎందుకు ఇష్టంలేదో కూడా తెలీదు. నా వ్యక్తిత్వానికి ఆ పేరు సరితూగదు అనిపించింది. ఆ తర్వాత నా సంగీతమే నాలో మార్పునకు కారణమైంది. నేను ఎక్కువగా ఉదయం 5 నుంచి 6గంటల మధ్యలో పనిచేస్తాను. ఎందుకంటే ఓ పాటను కంపోజ్‌ చేయాలంటే నన్ను నేను మైమరచిపోవాలి. తెల్లవారుజామున నన్ను ఎవ్వరూ డిస్టర్బ్‌ చేయరు. ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో పనిచేస్తుంటాను.’ అని వెల్లడించారు రెహమాన్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu