HomeTelugu Reviews'దిల్‌ బేచారా' మూవీ రివ్యూ

‘దిల్‌ బేచారా’ మూవీ రివ్యూ

Dil BecharaReview

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అభిమానులను శోక సంద్రంలో ముంచి దివంగతాలకేగిన ఈ టాలెంటెడ్‌ హీరో నటించిన ఆఖరి సినిమా ‘దిల్‌ బేచారా’. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడాలని ఫ్యాన్స్‌ ఎంతగానో ఆశపడ్డారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ‘దిల్‌ బేచారా’ను ఓటీటీ వేదికగా విడుదల చేయాల్సి వచ్చింది. ఈరోజు (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ ట్రైలర్స్‌లో అత్యధిక లైకులతో ఆల్‌టైమ్‌ రికార్డు సాధించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ : కిజీ బసు(సంజనా సంఘీ)కు థైరాయిడ్‌ క్యాన్సర్‌. జంషెడ్‌పూర్‌లో ఉంటుంది. క్యాన్సర్‌ కారణంగా ఊపిరి తిత్తులు పాడైపోయిన కిజీకి ఎల్లప్పుడూ ఆక్సిజన్‌ సిలిండర్‌ వెంట ఉండాల్సిందే. అందరు అమ్మాయిల్లాగే తనకూ సాధారణ జీవితం గడపాలని ఉన్నా.. క్యాన్సర్‌ కారణంగా తరచుగా ఆస్పత్రికి వెళ్లడం, చెకప్‌లకే సగం రోజులు గడిచిపోతూ ఉంటాయి. క్యాన్సర్‌ ఏదో ఒకరోజు తనను బలితీసుకుంటుందనే విషయం కిజీకి బాగా తెలుసు. అందుకే తను వెళ్లిపోయిన తర్వాత తనను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు, స్నేహితులు ఎలా ఫీలవుతారో తెలుసుకునేందుకు పరిచయం లేని వాళ్ల అంత్యక్రియలకు హాజరవుతూ ఉంటుంది.

ఇలాంటి సమయంలో తనకు ఓ రోజు కాలేజీలో ఇమాన్యుయేల్‌ రాజ్‌కుమార్‌ జూనియర్‌- మ్యానీ(సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌) పరిచయమవుతాడు. ఆ తర్వాత క్యాన్సర్‌ సపోర్టు గ్రూపులో మరోసారి కనిపిస్తాడు. కిజీలాగే మ్యానీ కూడా క్యాన్సర్‌ పేషెంట్‌. ఆస్టియోసర్కోమా తనను పీడిస్తూ ఉంటుంది. నటనను ప్రాణంగా ప్రేమిస్తూ, తలైవా రజనీకాంత్‌ను ఆరాధిస్తూ ఎంతో చలాకీగా ఉండే మ్యానీ వ్యక్తిత్వం కిజీకి బాగా నచ్చుతుంది. అలా కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య స్నేహం బలపడతుంది. మ్యానీ ఆమెకు ఎలాంటి అనుభూతులు పంచాడు? కిజీ ప్రేమను ఎలా పొందగలిగాడు? చివరికి వారి జీవితాలు ఎలాంటి ముగింపు తీసుకున్నాయనేదే ఈ సినిమా కథ.

Dil Bechara Movie Review

నటీనటులు: ఈ సినిమాకు హీరోహీరోయిన్ల నటనే ప్రాణప్రతిష్ట చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మ్యానీ పాత్రలో ఒదిగిపోయిన సుశాంత్‌ తన సహజమైన నటనతో కట్టిపడేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అందరి చేతా కంటతడి పెట్టించాడు. ఇక ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజన కూడా కిజీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ: ‘ద ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ అనే హాలీవుడ్‌ సినిమాకు దిల్‌ బేచారా రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. కథ సింపుల్‌గానే ఉన్నా భావోద్వేగ కథనంతో ఆద్యంతం ఎమోషనల్‌గా ప్రేక్షకులను మూవీలో లీనం చేయడంలో డైరెక్టర్‌ ముఖేశ్‌ చాబ్రా సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కథకు సుశాంత్‌ లాంటి టాలెంటెడ్‌ హీరోని ఎంపిక చేసుకోవడం బాగా కలిసి వచ్చింది. స్వర మాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సినిమాను మరో స్థాయికు తీసుకువెళ్లింది. సుశాంత్‌ అద్భుత నటన, భావోద్వేగ కథనం, మనసును తాకే డైలాగ్స్‌, శ్రావ్యంగా సాగే సంగీతం అన్నీ వెరసి దిల్‌ బెచారాకు ప్రేక్షకుల మదిలో స్థానం కల్పిస్తుందనడంలో సందేహం లేదు.

హైలైట్స్‌: సుశాంత్‌ నటన

డ్రాబ్యాక్స్: పెద్దగా కనిపించవు

టైటిల్ :’దిల్‌ బేచారా’
నటీనటులు: సుశాంత్ సింగ్‌ ‌ రాజ్‌పుత్‌ , సంజనా సంఘి, సైఫ్‌ అలీఖాన్
దర్శకత్వం : ముఖేశ్‌ చాబ్రా
నిర్మాత : ఫాక్స్ స్టార్ స్టూడియోస్
సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌

చివరిగా : సుశాంత్‌ అద్భుతమైన చివరి ప్రేమకథ
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!