కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రానున్నాయని, రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వనమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. ‘తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తా. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తా. పోలవరం నిర్మాణానికి చివరి రూపాయి కూడా కేంద్రమే ఇస్తుంది’ అని కిషన్‌రెడ్డి అన్నారు. మౌలిక వసతుల కోసం కేంద్రం అధిక నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. కేంద్రంలో వరుసగా రెండోసారి మరింత బలమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రపంచదేశాల్లో భారత్‌ గౌరవం పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎన్నో చర్యలు చేపట్టామన్నారు. ఏపీ అవసరాలను కేంద్రం తీరుస్తుందనే నమ్మకముందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్‌ తయారు చేసిందని.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితిలో మోడీ ప్రధాని అయ్యారన్నారు. దేశంలో పుల్వామా మినహా మరెక్కడా ఉగ్రవాద ఘటనల్లేవని చెప్పారు.