
Tirumala Fake Darshan Tickets:
తిరుమల తిరుపతిలో భక్తులు ఇంకా బస్ ప్రమాదం, తొక్కిసలాట సంఘటనల విషాదం నుంచి కోలుకోకముందే, ఇప్పుడు నకిలీ దర్శనం టిక్కెట్ల ముఠా వార్తలు కొత్తగా కలవరం కలిగిస్తున్నాయి.
టిటిడి ఉద్యోగులు లక్ష్మీపతి, మణికంట, క్యాబ్ డ్రైవర్లు జగదీష్, శశి కలిసి ఈ నకిలీ టిక్కెట్ల ముఠాను నడిపించారు. లక్ష్మీపతి టిటిడి ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కౌంటర్‌లో ఉద్యోగిగా పని చేస్తుండగా, మణికంట ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో ఉన్నాడు. టిటిడిలో పనిచేస్తున్నందున, వీరికి అంతర్గత సమాచారం తెలుసు. ఆ అనుభవంతోనే నకిలీ టిక్కెట్ల వ్యాపారాన్ని ప్రారంభించారు.
లక్ష్మీపతి, మణికంట ఒకేలా కనిపించే రూ. 300 దర్శనం టిక్కెట్లను ప్రింట్ చేశారు. వాటిని క్యాబ్ డ్రైవర్లు జగదీష్, శశి ద్వారా భక్తులకు అమ్మారు. తక్కువ ధరకు టిక్కెట్లు దొరుకుతున్నాయని నమ్మించి వారికి అమ్మకాలు చేశారు. అంతేకాదు, లక్ష్మీపతి విధి నిర్వహణలో ఉన్నప్పుడు నకిలీ టిక్కెట్లు తీసుకున్న భక్తులకు దర్శనం జరిగేలా చూసేవారు.
టిటిడి వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే నకిలీ టిక్కెట్ల రూపంలో రూ. 20,000కి పైగా అమ్మకం జరిగింది. అయితే ఈ ముఠా పనితీరును టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించి విచారణ ప్రారంభించారు.