Homeతెలుగు Newsరేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది?: హైకోర్టు

రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది?: హైకోర్టు

13 2టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని అడ్వొకేట్‌ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రేవంత్‌ రెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్‌ ‌నిర్బంధంపై ఈ మధ్యాహ్నం రెండుసార్లు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి నేరుగా అడ్వొకేట్‌ జనరల్‌ వచ్చి వాదనలు వినిపించాలని ఆదేశించి విచారణను సాయంత్రం 4.30 గంటలకు కోర్టు వాయిదా వేసింది. దీంతో ఏజీ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ విడుదలపై ఏజీ వాంగ్మూలాన్ని హైకోర్టు నమోదు చేసింది. అరెస్టుకు ఆధారాలు రేపు సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు.

కేసీఆర్‌ పర్యటన సందర్భంగా రేవంత్‌ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని, శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను అదుపులోకి తీసుకున్నామని ఈ మధ్యాహ్నం విచారణ సమయంలో పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పేంటని.. ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని పోలీసులను ప్రశ్నించింది. నిఘావర్గాల సమాచారం మేరకే తాము రేవంత్‌ రెడ్డిని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలపగా.. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తున్న సమయంలో కొడంగల్‌ అభ్యర్థిగా ఉన్న రేవంత్‌ను పోలీసులు ఎక్కడ ఉంచారో కూడా తమకు సమాచారం లేదని, ఆయన ఎక్కడ ఉన్నా కోర్టులో హాజరు పరచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వేం నరేందర్‌ రెడ్డి లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది.

ఒకవేళ రేవంత్‌ను అరెస్టు చేయకపోతే శాంతిభద్రతల సమస్య వస్తుందని ఏ విధంగా అంచనాకు వచ్చారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్‌ సమాచారం నివేదిక ఆధారంగానే రేవంత్‌ను అరెస్టు చేశామని వారు చెప్పగా.. ఆ నివేదిక ఏంటో, దానిలో ఏముందో ఆ వివరాలను తమ ఎదుట ఉంచాలని ఆదేశిస్తూ అందుకు అరగంట సమయం ఇచ్చింది. ఆ గడువు అనంతరం మరోసారి విచారణలో రేవంత్‌ను ఈ సాయంత్రం 4.30గంటల తర్వాత విడుదల చేస్తామని పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించేందుకు తమకు సమయం కావాలని కోరారు. దీనికి సంబంధించిన ఆధారాలు రేపు సమర్పిస్తామని పోలీసులు గడువు కోరగా.. పోలీసుల తీరుపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ఆయన అరెస్టు సక్రమంగా ఉంటే ఆధారాలు ఇవ్వడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించింది. ఈ రోజే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, కారణాలు తమకు చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అవసరమైతే మరో గంట సమయం ఇస్తామని పేర్కొంటూ.. విచారణను సాయంత్రం 4.30 గంటలకు వాయిదా వేసింది. పోలీసుల తరఫు న్యాయవాదిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఈ వ్యవహారానికి సంబంధించి నేరుగా అడ్వొకేట్‌ జనరల్‌ వచ్చి వాదనలు విన్పించాలని ఆదేశించడంతో ఆయన కోర్టులో హాజరయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu