‘జీరో’ మూవీ సెట్లో అగ్ని ప్రమాదం

ప్రముఖ నటుడు షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జీరో. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్‌ సరసన కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ మూవీ సెట్‌లో నిన్న (గురువారం) సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ముంబైలోని ఫిల్మ్‌ సిటీలో ఓ పాట చిత్రీకరణ కోసం వేసిన సెట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం తెలుసుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో సెట్‌లో షూటింగ్‌ కోసం వినియోగించే పరికరాలు ధగ్దమయ్యాయి.

ఈ ఘటన జరిగిన సమయంలో షారూఖ్ సెట్‌లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదంలో షారూఖ్‌కు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. షారూఖ్‌ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.