సినీ నటుడు అలీకి గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ సీటు..?


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సినీ నటుడు అలీ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే గుంటూరు నగరంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరులో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు అందజేశారు. దీన్ని పరిశీలించిన అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో ఓటరుగా నమోదై ఉన్నారని తెలుసుకుని ఆ విషయాన్ని అలీకి చెప్పారు. తనకు తెలంగాణలో ఓటు హక్కు తొలగించినా అభ్యంతరం లేదని, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించాలని ఆయన కోరారు.

గుంటూరు నియోజకవర్గం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు పలువురి పేర్లను దాదాపుగా ఖరారు చేశారు. తెనాలి నుంచి ఆళ్లపాటి రాజా పేరు దాదాపు ఖరారైంది. గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానానికి సినీనటుడు అలీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు పశ్చిమకు మద్దాల గిరి, కోవెలమూడి రవీంద్ర లేకుంటే రెడ్డి, ఎస్సీ, కాపు సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం దక్కనుంది. తాడికొండ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్న శ్రావణ్‌కుమార్‌ కాకుండా బాపట్ల ఎమ్మెల్యే మల్యాద్రి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పేర్లు పరిశీలిస్తున్నారు. ప్రత్తిపాడు నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కుమార్తె లేదా కందుకూరు వీరయ్య లేదా విశ్రాంత ఐఏఎస్‌ అధికారుల్లో ఒకరిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మంగళగిరి అసెంబ్లీ స్థానానికి చిరంజీవులు, మరుగుడు హనుమంతరావు, తిరువీధుల శ్రీనివాసరావు, కాండ్రు కమల పోటీలో ఉన్నారు.