డైరెక్టర్ హరీశ్ శంకర్ త్వరలో పవన్ కల్యాణ్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే హీరో రామ్ తో తన సినిమా ఉంటుందని ప్రకటించడం విశేషం. నిన్న రాత్రి జరిగిన ‘ది వారియర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. రాపో (రామ్ పోతినేని) లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏమిటంటే అందరితో మంచి ర్యాపో మెయింటేన్ చేస్తాడని చమత్కరించారు.
”దేవదాసు నుంచి నేను రామ్ అభిమాని ని. ఆయన హీరోగా సినిమా చేయడానికి చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ, కొన్ని కారణాల వలన కుదరలేదు. ఆయన ఒక హీరోగా కాకుండా ఒక ప్రేక్షకుడిగా కథను వినడం నాకు నచ్చుతుంది. రామ్ తో తప్పకుండా సినిమా చేస్తాను. అది ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడు చెప్పలేను” అంటూ వెల్లడించాడు.