
హీరో రామ్ టాలీవుడ్‌లలో తనకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసిందని, వారితో పోటీ పడటమే తన లక్ష్యమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ నటించిన తాజా చిత్రం ‘రెడ్’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుండగా, తాజాగా విశాఖలో జరిగిన సక్సెస్ మీట్ లో రామ్ మాట్లాడాడు. “ఈ సినిమా ముందు వరకూ ఒక లెక్క. ఇకపై ఒక లెక్క. అభిమానులే నాకు అసలైన పోటీ. అందరమూ ఎంతో కష్టపడి సినిమా చేశాం. సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమాను చేశాం. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనన్న భయం, టెన్షన్ ఇప్పుడు పోయింది.
సినిమాలో ఉన్న ట్విస్టుల కన్నా, విడుదల తరువాత వచ్చిన ట్విస్టులు పెరిగిపోయాయి. భారీ కలెక్షన్లను అభిమానులు కురిపించారు. ఈ విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం సంక్రాంతి సందర్భంగానే నేను ‘దేవదాసు’తో ఇండస్ట్రీలోకి వచ్చాను. నాకు పోటీ ఎవరని చాలా మంది అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్పగలను. ఫ్యాన్సే నాకు నిజమైన పోటీ. వారు చూపించే ప్రేమ కన్నా, నా నటనతో వారిని అలరించడంలో నేనే ముందుంటానని చూపడమే నా టార్గెట్” అని రామ్ వ్యాఖ్యానించాడు. ఈ మూవీ తర్వాత రామ్ క్యూలో పలువురు దర్శకులు ఉన్నారు. పూరితో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్లో నటించేందుకు రామ్ సన్నాహకాల్లో ఉన్నారని టాక్.













