షూటింగ్‌లో గాయపడ్డ శర్వానంద్‌

టాలీవుడ్‌లోని పలువురు యంగ్‌ హీరోలకు ప్రమాదాలకు గురవుతున్నారు. మొన్న నాగ శౌర్య, నిన్న సందీప్‌ కిషన్‌.. అంతకుముందు వరుణ్‌ తేజ్‌ ప్రమాదాలకు గురై గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా శర్వానంద్‌కు కూడా షూటింగ్‌లో భాగంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న అనువాద చిత్రం ’96’ షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. `షూటింగ్‌లో భాగంగా శ‌ర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. శిక్షకుల పర్యవేక్షణలో శ‌ర్వా రెండు రోజులు ప్రాక్టీస్ చేశారు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు జాగ్రత్తగా ల్యాండ్ అయ్యారు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. కాళ్లపై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. అదుపు తప్పి భుజాలపై ల్యాండ్‌ అవ్వడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనికి గాయాలయ్యాయి. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్‌ సిబ్బంది శర్వానంద్‌ను థాయ్‌లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇక్కడి సన్‌షైన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ‌ర్వాను వైద్యులు పరీక్షించి.. భుజానికి బ‌ల‌మైన గాయం కావడంతో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని సూచించారు. సోమ‌వారం ఆపరేషన్‌ జ‌రగ‌నుంది. దీని త‌ర్వాత క‌నీసం నాలుగు రోజుల పాటు శర్వా ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.