
మూవీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా క్రేజ్ ను తెచ్చుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. స్టార్ డమ్ రావడానికి కొంతమందికి కొన్నేళ్ల సమయం పడితే, మరికొంతమందికి చాలా తక్కువ సినిమాలతోనే స్టార్ డమ్ వస్తుంది. అలాంటి హీరోలలో ఒకరిగా యశ్ కనిపిస్తాడు. ‘కేజీఎఫ్’ సినిమాతో ఒక్కసారిగా ఆయన స్థాయి మారిపోయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇటీవల వచ్చిన ‘కేజీఎఫ్ 2’ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. వేయి కోట్ల క్లబ్ లోకి చాలా తేలికగా చేరిపోయిన ఈ సినిమా , ఒక్క హిందీలోనే 400కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఇక ‘కేజీఎఫ్ 3’ కూడా ఉందని చెప్పడంతో ఆయన ఆ సినిమా పనుల్లోనే ఉంటాడని అనుకున్నారు.
కానీ ఈ లోగా ఆయన తెలుగులో ఒక భారీ యాక్షన్ మూవీ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాకి నిర్మాత దిల్ రాజు అని అంటున్నారు. శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా .. వంశీ పైడిపల్లితో విజయ్ సినిమా చేస్తున్న ఆయన, యశ్ తోను ఓ ప్రాజెక్టును సెట్ చేస్తున్నట్టు వినికిడి. త్వరలోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు వివరాలను వెల్లడించనున్నట్టు సమాచారం.













