ప్రభాస్ కు ఫ్యాన్ గా మారిన రణబీర్!

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటివరకు తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ప్రపంచ నలుమూలలకు పాకింది. చాలా మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. అందులో సినీతారలు సైతం ఉన్నారు. తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా ప్రభాస్ కు అభిమానిగా మారిపోయానని తెలిపారు. ప్రస్తుతం తను నటించిన ‘జగ్గా జాసూస్’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రణబీర్.. తనకు ప్రభాస్ మీద చెప్పలేనంత ఇష్టం కలుగుతోందని, బాహుబలి సినిమాతో అతడికి అభిమానిగా మారిపోయాయని అన్నారు. బాహుబలి పాత్రలో ఆయనను తప్ప మరెవరిని ఊహించుకోలేం. అంత అధ్బుతంగా నటించారని పేర్కొన్నారు. 
తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ తో కలిసి రణబీర్ కపూర్ నటించిన ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రణబీర్ కపూర్ నిర్మించడం విశేషం. అయితే ఇంకెప్పుడూ నిర్మాతగా సినిమా చేయనని రణబీర్ చెప్పడం గమనార్హం. నిర్మాణ బాధ్యతలు చేపట్టడం కష్టమైన విషయమని, ఈ సినిమాకు అనురాగ్ ఆ విషయంలో సహాయం చేశారని ఇకపై ఏ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించనని స్పష్టం చేశారు.