మెరుపుదాడిలో 300 ఉగ్రవాదులు హతం?

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్‌ భీకరదాడికి పాల్పడింది. నియంత్రణ రేఖను దాటి బాలాకోట్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. మిరాజ్‌-2000 యుద్ధ విమానాల ద్వారా దాదాపు వెయ్యి కిలోల బరువున్న బాంబులతో ఈ దాడి చేపట్టింది. కాగా.. ఈ ఘటనలో దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్ర శిబిరాల్లో బాలాకోట్‌ శిబిరం చాలా పెద్దది. దాదాపు 6 నుంచి 7 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. ఇక్కడ దాడి జరిగిందంటే మృతుల సంఖ్యే ఎక్కువే ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పాకిస్థాన్‌ మాత్రం ఈ వార్తలను తిప్పికొడుతోంది. పాక్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన భారత యుద్ధ విమానాలను తాము సమర్థంగా తిప్పికొట్టామని ఆ దేశ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ తెలిపారు. తమ వైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. పాకిస్థాన్ భూభాగంలోకి 1971 యుద్ధం త‌ర్వాత భార‌త ఫైట‌ర్ జెట్లు వెళ్లడం ఇదే మొద‌టిసారి.