ఆ హీరోతో డేటింగ్ చేయడం లేదు: కైరా

బాలీవుడ్‌ నటులు కైరా అద్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రేమలో ఉన్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో కైరాను సిద్ధార్థ్‌ గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. తను ఇంకా సింగిల్‌గానే ఉన్నట్లు స్పష్టం చేశారు. సిద్ధార్థ్‌తో ప్రేమలో లేనని అన్నారు. ఇలాంటి వదంతుల్ని మీరు ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. ‘అవి కేవలం వదంతులు మాత్రమే.. అది నిజం’ అని చెప్పారు.

ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ షోలో వ్యాఖ్యాత కరణ్‌ జోహార్‌ సిద్ధార్థ్‌ను కైరా గురించి ప్రశ్నించారు. ‘కైరా భవిష్యత్తులో నా సహనటి కాబోతోంది. ఈ విషయమే నాకు సంతోషాన్ని కల్గిస్తోంది. ఆమెతో కలిసి నేను పనిచేయబోతున్నా. మాపై వస్తున్న వదంతులపై నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ ఆ వదంతులు నిజమైతే బాగుంటుందని ఆశిస్తున్నా. కానీ ప్రజలు అనుకున్నంత కలర్‌ఫుల్‌గా నా జీవితం లేదు’ అని సిద్ధార్థ్‌ జవాబిచ్చారు.

‘వినయ విధేయ రామ’ తర్వాత కైరా హిందీ సినిమా ‘కళంక్‌’ లోని ప్రత్యేక గీతంలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ పాటకు విశేషమైన ఆదరణ లభించింది. దీని తర్వాత ఆమె ‘గుడ్‌న్యూస్‌’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమెతోపాటు అక్షయ్‌ కుమార్‌, కరీనా కపూర్‌ నటిస్తున్నారు. రాజ్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సెప్టెంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.