Iddaram Movie Review

నటీనటులు: 
సంజీవ్, సాయికృప, రంగనాథ్ తదితరులు..
సాంకేతికవర్గం: 
సంగీతం: కిరణ్ శంకర్
ఛాయాగ్రహణం: ఎస్.జె.సిద్దార్థ్
మాటలు: టైమ్ నాని
నిర్మాణం-దర్శకత్వం: సుధాకర్ వినుకొండ
విడుదల తేదీ: 8/7/2016 
రేటింగ్: 2.5/5 
“వెల్ కమ్ ఒబామా” ఫేమ్ సంజీవ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “ఇద్దరం”. సాయికృప కథానాయికగా పరిచయమైన ఈ చిత్రం ద్వారా యువ ప్రతిభాశాలి సుధాకర్ వినుకొండ కూడా దర్శకుడిగా పరిచయమయ్యాడు. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
 
కథ: 
అజయ్ (సంజీవ్) ఓ అనాధ. ఓ క్రీస్టియన్ మిషినరీలో పెరుగుతాడు. తనలా మరొకరు “ప్రేమ మత్తు” కారణంగా అనాధలుగా మారకూడదని నిశ్చయించుకొని పెళ్ళికి ముందే తొందరపడుతున్న ప్రేమికులను పట్టుకొని.. వారికి తగిన బుద్ధి చెప్పాలనుకొంటాడు. అయితే.. అజయ్ కేవలం వారిని భయపెట్టాలనుకోగా, అతడి స్నేహితులు మాత్రం దొరికిన అమ్మాయిని బలవంతంగా అనుభవిస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటారు.
కట్ చేస్తే.. ఒకరోజు తమకు ఎదురు తిరిగాడని అజయ్ ను కారుతో గుద్దేస్తారు అతడి స్నేహితులు. దాంతో గతం మర్చిపోయిన అజయ్ మూడు నెలలపాటు హాస్పిటల్ లో ఉండి డిశ్చార్జ్ అవుతాడు. ఆ తర్వాత తన గతాన్ని తవ్వుకొనే సమయంలో అతడికి ఊహించని నిజాలు తెలుస్తాయి.
అజయ్ ను అతడి స్నేహితులు ఎందుకు చంపాలనుకొన్నారు ?
కోమా నుంచి తేరుకొన్నాక అజయ్ తెలుసుకొన్న నమ్మలేని నిజాలేమిటి ? అనేది “ఇద్దరం” కథాంశం!
నటీనటుల పనితీరు: 
అజయ్ పాత్రలో నటించిన సంజీవ్ గతం మర్చిపోయిన యువకుడిగా, ప్రేయసి కోసం ఆరాటపడే భగ్నప్రేమికుడిగా మంచి నటన కనబరిచాడు. ద్యాంసుల విషయంలో మాత్రం ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది.
హీరోయిన్ గా నటించిన సాయికృప తొలి సినిమా అయినప్పటికీ.. ఏమాత్రం బెరుకు లేకుండా చాలా ఈజీగా పల్లవి అలియాస్ పద్దు పాత్రలో ఒదిగిపోయింది. కాకపోతే అమ్మడు అందాల ప్రదర్శన విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించి ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇబ్బంది ఉండేది కాదు.
దివంగత నటులు రంగనాధ్ గారు ఈ సినిమాలో హుందాగా నటించారు. మానవరాలిని పోగొట్టుకొన్న తాతయ్యగా, బ్రతికి ఉన్న మనవడి కోసం తాపత్రయపడే వ్యక్తిగా రంగనాధ్ గారు ఆయన సీనియారిటీని నిరూపించుకొన్నారు.
డాక్టర్ పాత్రలో సూర్య అవసరమైన మేరకు నటన కనబరిచాడు.
Iddaram1
సాంకేతికవర్గం పనితీరు: 
కిరణ్ శంకర్ బాణీలు బాగున్నాయి. అయితే.. నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. అలాగే ఓల్డ్  క్లాసిక్ గా పేర్కొనబడే ‘నిను వీడనే నీడను నేనే” పాట రీమిక్స్ ఆకట్టుకొనే విధంగా లేదు.
ఎస్.జె.సిద్దార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బానే ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మైనస్ అనే చెప్పాలి. సాంగ్స్ లో స్లైడింగ్ ఎఫెక్ట్ షాట్స్ తో దర్శకుడు తన ప్రతిభను చూపిద్దామనుకొన్నప్పటికీ.. కెమెరా వర్క్ సహరించకపోవడంతో అదీ సాధ్యపడలేదు.
టైమ్ నాని రాసిన సంభాషణలు ఫర్వాలేదు. కానీ.. చాలా చోట్ల సిట్యుయేషన్ కి సంబంధం లేకుండా ఉంటాయి మాటలు.
దర్శకనిర్మాత సుధాకర్ వినుకొండ “ఇద్దరం” సినిమా కోసం పడిన తపన ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. కాకపోతే.. స్క్రీన్ ప్లే పరంగా ఆడియన్స్ ను థ్రిల్ చేద్దామనుకొని చతికిలపడ్డాడు. ట్విస్టులు బాగున్నప్పటికీ.. వాటిని సరిగా డీల్ చేయలేకపోయాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. క్లైమాక్స్ ను ఇంకాస్త కృస్పీగా ఎండ్ చేస్తే ఇంకా బాగుండేది.
విశ్లేషణ: 
వైవిధ్యమైన కాన్సెప్ట్ తో సినిమా తీద్దామనుకోవడం కరెక్టే, నేటితరం ఆడియన్స్ కూడా వైవిధ్యాన్నే కోరుకొంటున్నారు. కానీ.. ఆ వైవిధ్యంలో క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేనప్పుడు ఎంత డిఫరెంట్ ఎటెంప్ట్ చేసినా దాన్ని ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది. “ఇద్దరం” విషయంలోనూ అదే జరిగింది. మంచి కథ ఉంది కానీ కథనం ఆకట్టుకొనే స్థాయిలో లేదు. కానీ.. దర్శకుడిగా మాత్రం సుధాకర్ మంచి మార్కులు సంపాదించుకొన్నాడు. పాటల చిత్రీకరణలో తన మార్క్ ను చూపాలనుకొన్నాడు. అయితే.. నిర్మాత-దర్శకుడు తానే అవ్వడం వల్లనో లేక నిర్మాణ పరమైన ఇబ్బందుల వలనో తెలియదుగానీ.. దర్శకుడిగా మాత్రం పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. ఓవరాల్ గా “ఇద్దరం” ఒక మంచి ప్రయత్నం!