తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలి: జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకెళ్లారని ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారనీ, ప్రాజెక్టు పూర్తయ్యాక సీఎం హోదాలో అక్కడికి వెళ్లానని అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో జగన్‌ మాట్లాడారు. ‘నేను వెళ్లినా.. వెళ్లకపోయినా వాళ్లు ప్రాజెక్టు పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేస్తుంటే చంద్రబాబు ఏం చేశారు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కదా.. ఆల్మట్టి ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుకుంటూ పోతే ఆయన ఏం చేశారు’ అని జగన్‌ ప్రశ్నించారు. అంత ఎత్తుకు పెంచుకుంటూ పోతే మనకు నీళ్లు ఎలా వస్తాయో కనీసం ఆలోచించారా? అని విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలని సీఎం జగన్‌ అన్నారు. గోదావరి జలాల వినియోగం గురించి మాట్లాడుతూ.. ‘గోదావరికి నాసిక్‌, ఇంద్రావతి, శబరి పాయలున్నాయి. కేవలం మన రాష్ట్రంలో ఉన్న గోదావరి పాయ శబరి మాత్రమే. కేవలం 500 టీఎంసీల నీరు మాత్రమే శబరి నుంచి గోదావరికి వస్తోంది. కృష్ణ, గోదావరి జలాలను అనుసంధానించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఆహ్వానించ దగ్గవే. పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే చూస్తూనే ఉన్నాం. ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది’ సీఎం జగన్‌ అన్నారు.