జాన్వి కపూర్ పెళ్లి అక్కడే జరుగుతుందట!

అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్.. అప్పుడే పెళ్లి గురించి సన్నాహాలు చేసేస్తోంది‌. తొలి చిత్రం ‘ధడక్‌’ తో ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంది జాన్వి. ఎన్నో మ్యాగజైన్లు ఆమె ఫొటోషూట్స్‌, ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నాయి. ప్రముఖ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా డిజైన్ చేసిన పెళ్లికుమార్తె దుస్తులు ధరించి ‘బ్రైడ్స్‌ టుడే’ మ్యాగజైన్‌కు ఫొటోషూట్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా వారు నిర్వహించిన ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడింది.

తాను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నానన్న విషయం తెలీదు కానీ చేసుకుంటే మాత్రం ఇటలీలోని ఫ్లోరెన్స్‌ ప్రాంతంలోనే చేసుకుంటానని అంటోంది. గతంలో తన తల్లిదండ్రులతో కలిసి విహారయాత్ర నిమిత్తం ఫ్లోరెన్స్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రాంతపు అందాలను చూసి మతిపోయిందని తెలిపింది. అందుకే అక్కడే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఇక జాన్వి వ్యక్తిగత విషయానికొస్తే.. ఆమె శిఖర్‌ పహారియా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. శిఖర్‌ కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు. గతంలో జాన్వి, శిఖర్‌ వ్యక్తిగత ఫొటోలు కూడా బయటికి వచ్చాయి.

ఇటీవల మ్యాగజైన్‌ ఫొటోషూట్‌ నిమిత్తం జాన్వి స్విట్జర్లాండ్‌కు వెళ్లింది. ఆ సమయంలో జాన్వి.. శిఖర్‌ను కలిసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇందుకు శిఖర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోనే ఈ వార్తలకు కారణం. జాన్వి పక్కన శిఖర్‌ నిలబడినప్పుడు తమ నీడను ఫొటో తీసినట్లుగా ఆ ఫొటో ఉంది. ఆ తర్వాత ఈ ఫొటో కాస్తా వైరల్‌ అవడంతో శిఖర్‌ దానిని ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించాడు.