ప్రతిష్ఠాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో కీర్తి సురేష్ ‘ఉత్తమ నటి’ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో ఆమె నటనకు గానూ ఈ పురస్కారం లభించింది. దీంతో కీర్తిని అభినందిస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించింది.
‘జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నందుకు కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు. చాలా థ్రిల్‌కు గురయ్యాను. ఈ అవార్డు సాధించాల్సిన దాని కంటే మీకు ఎక్కువ అర్హతలే ఉన్నాయి’ అని జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రంలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. అజయ్ దేవ్‌గణ్ ఇందులో హీరో. భారత ఫుట్‌బాల్ ఆటగాడు, కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితాధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇందులో సావిత్రి పాత్రకు కీర్తి ప్రాణం పోసింది. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా..రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’ గా కూడా జాతీయ అవార్డు గెలుచుకుంది.