నీ నుంచి బెదిరింపులు ఎదుర్కొన్న.. నువ్వంటే నాకెంతో ఇష్టం: జాన్వీ

‘చిన్ననాటి నుంచి నీ నుంచి నేను ఎదుర్కొన్న బెదిరింపులకు ఉదాహరణ ఇది… అయినా నువ్వంటే నాకెంతో ఇష్టం, ఎంత అంటే నువ్వు ఊహించలేనంతగా.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ తన చిట్టి చెల్లెలు ఖుషీ కపూర్‌కు.. బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ‌. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ పోస్ట్‌ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. బుల్లి జాన్వీ, ఖుషీలు టీవీ ముందు డాన్స్‌ చేస్తున్న ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

‘సో క్యూట్‌.. ఈ చిన్నారులు ఇద్దరు.. ప్రస్తుతం ఇద్దరు కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించిన యువతులు. మీ బంధం ఇలాగే కలకాలం వర్ధిల్లాలి’ అంటూ ఖుషీకి విషెస్‌ తెలుపుతున్నారు. తల్లి శ్రీదేవి మరణించిన తర్వాత ఖుషీ తొలి పుట్టినరోజు ఇదే కావడంతో.. ‘మీ అమ్మ ఎక్కడ ఉన్నా మీ బంధం చూసి ఆనందపడతారు. ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీరు’ అంటూ జాన్వీ, ఖుషీలను అభినందిస్తున్నారు.

కాగా ఖుషీతో ఉన్న రిలేషన్‌షిప్‌ గురించి జాన్వీ కపూర్‌ పలు సందర్భాల్లో మీడియాతో పంచుకున్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘ఇంటి బయట మాత్రమే హీరోయిన్‌ అనే స్టేటస్‌ ఉంటుంది. ఇంట్లో మాత్రం నేను సాదాసీదా అమ్మాయినే. స్టార్‌ని అనే ఫీలింగ్‌ని నాకు రాకుండా, నన్ను భూమ్మీదే ఉంచుతుంది నా చెల్లెలు ఖుషీ(నవ్వుతూ). ‘నువ్వు చాలా కూల్‌ అనుకుంటావు కానీ అలా ఏం కాదు అంటూ సరదాగా ఆటపట్టిస్తూ నన్ను ఏడిపిస్తూ ఉంటుంది. నాతో అన్ని పనులు చేయించుకుంటుంది. అయినా ఖుషి అంటే నాకు చాలా ఇష్టం. తనను నా చెల్లెలు అనడం కంటే అక్క అనడం బెటరేమో! ‘అంటూ చెల్లెలి గురించి జాన్వీ బోలెడు కబుర్లు చెప్పింది. ఇక బోనీ కపూర్‌- శ్రీదేవి దంపతుల పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ ‘ధడఖ్‌’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. అక్క బాటలోనే ఖుషీ కూడా త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్‌.