పాకిస్తాన్‌ ఉగ్రమూకలపై కంగన సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటి కంగన రనౌత్ .. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఇటీవల పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపు దాడులు చేపట్టినప్పటికీ తనకు ఇంకా కోపం చల్లారలేదని అంటున్నారు‌. ఆదివారం ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన సమావేశంలో పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంగన తన బాలీవుడ్‌ ప్రయాణం గురించి, బంధుప్రీతి గురించి, భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల గురించి చర్చించారు. ‘కొన్ని రోజుల క్రితం పలు మీడియా వర్గాలు భారత వైమానిక దళం చేపట్టిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ గురించి నన్ను ప్రశ్నించాయి. దీనిపై నేను స్పందిస్తూ.. పాకిస్తాన్‌ సర్వనాశనమైపోవాలని అన్నాను. ఆ సమయంలో నాకే కాదు ప్రతీ భారతీయుడికీ అలాగే అనిపిస్తుంది. కేవలం పాకిస్తానీయులను సినిమా పరిశ్రమ నుంచి బ్యాన్‌ చేస్తే సరిపోదు. అసలు ఆ దేశాన్నే అంతం చేసేయాలి. గత కొన్ని శతాబ్దాలలో ఇలాంటి ఘోర ఉగ్ర దాడి (పుల్వామాను ఉద్దేశిస్తూ) జరిగి ఉండదని నా అభిప్రాయం. మనం మెరుపు దాడులు చేపట్టి బుద్ధిచెప్పినప్పటికీ పుల్వామా దాడి గాయం మన గుండెల్లోనే ఉండిపోతుంది. నేను అనే ప్రతీ మాట సరైనది కాకపోవచ్చు. నిజాయతీగా చెప్పాలంటే పుల్వామా దాడి గురించి తెలీగానే నాకు వెంటనే సరిహద్దు వద్దకు వెళ్లి ఎవరి నుంచైనా తుపాకీ లాక్కుని ఉగ్రమూకలను కాల్చిపడేయాలన్నంత కోపం వచ్చింది’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు కంగన.

పుల్వామా ఘటనపై కానీ, భారత్‌ చేపట్టిన మెరుపు దాడుల గురించి కానీ బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ స్పందించలేదు. దీనిపై కంగన స్పందిస్తూ.. అతనోన బాధ్యతలేని పౌరుడని మండిపడ్డారు. ‘అతనెందుకు మాట్లాడతాడు. తాగడానికి నీరు, వాడుకోవడానికి 24 గంటలూ విద్యుత్‌ లభిస్తోందిగా. ఓ స్టార్‌ హీరో అయివుండి ఆయన పబ్లిక్‌కి ఈ విషయాలపై అవగాహన కల్పించాలి. రణ్‌బీర్‌లాంటి ఎందరో నటులు ఈ దేశానికి మంచి చిత్రాలను అందించారు. కానీ ఏం లాభం దేశం పట్ల బాధ్యతనేదే లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates