జయలలిత బయోపిక్‌పై కంగనా స్పందన

దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ఈ చిత్రాన్ని ‘జయ’ టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. తమిళ దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టులో కంగన నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో నటించడం గురించి కంగన తాజాగా ఓ పత్రికతో మాట్లాడారు. జయలలిత తనకు పూర్తి వ్యతిరేకంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ‘జయలలిత చాలా విధేయతతో ఉండేవారు. ఎటువంటి మార్గంలోకి వెళ్తున్నాను, దాని ప్రభావం ఎలా ఉంటుందని ఆలోచించని మహిళ ఆమె. సమస్యల్ని ఎదుర్కొని తిరిగి నిలదొక్కుకునేవారు. ఆమె ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నారు, కష్టాలుపడ్డారు’ అని కంగన అన్నారు.

దక్షిణాది గురించి మాట్లాడుతూ… ‘అక్కడి వారు నన్ను అక్క అని పిలుస్తారు. దక్షిణ భారత దేశం చాలా విభిన్నంగా ఉంటుంది. వారికి తమ సొంత నటులే మెగాస్టార్స్‌. వారు హిందీ సినిమాలు చాలా తక్కువగా చూస్తుంటారు. చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో మాత్రమే ప్రజలు హిందీ చిత్రాల్ని చూస్తుంటారు. నేను అక్కడి ప్రదేశాలకు వెళితే ఎవ్వరూ గుర్తుపట్టరు, స్వేచ్ఛగా తిరిగి రావొచ్చు’ అని ఆమె తెలిపారు.