కేసీఆర్‌కు నన్ను విమర్శించే హక్కులేదు: చంద్రబాబు

అనంతపురంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమ్మేళనంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నాయకులు టీడీపీను విమర్శిస్తూ ప్రధాని మోదీతో లాలూచీ పడుతున్నారని అన్నారు. అటువంటి పరిస్థితులను చూసే తెలంగాణలో తాము ప్రజాకూటమిలో చేరామన్నారు. కేసీఆర్‌కు తనను విమర్శించే హక్కులేదన్నారు. కేసీఆర్‌ ప్రతి రోజూ మనల్నే తిడతారు. ఎందుకు తిడతారో నాకైతే అర్థంకాలేదు. హైటెక్ ‌సిటీ కట్టించినందుకా? హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచ చిత్ర పటంలో నిలిపిందుకా? ఓ గొప్ప హైదరాబాద్‌ నగరాన్ని తెలుగు జాతి కోసం ఇస్తే సరిగా పాలించకుండా నన్ను విమర్శించే హక్కు మీకెక్కడిది. కేసీఆర్‌ టీడీపీను విమర్శిస్తూ.. మోడీతో లాలూచీ పడ్డారు. అది చూసిన తర్వాతే ప్రజాకూటమికి ఒప్పుకున్నాం. నిన్న యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణకు తెలంగాణ ఇచ్చామని, ఎక్కువ ఆదాయం ఉందని అన్నారు. ఏపీ ఆదాయం తక్కువగా ఉందని, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు’ అని చంద్రబాబు అన్నారు.

‘రాష్ట్రంలో పరిశ్రమల ద్వారా 30లక్షల ఉద్యోగాలు వస్తాయి. నాలుగున్నరేళ్లలో 16లక్షల కోట్లతో ఎంఓయూలు కుదుర్చుకున్నాం. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషిచేస్తున్నాం. సులభతర వాణిజ్యం, నైపుణ్య శిక్షణలో అగ్రస్థానంలో ఉన్నాం. విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మనదే. రాష్ట్రంలో 25వేల కిలోమీటర్ల మేర సిమెంట్‌ రోడ్లు వేశాం. జిల్లాలో వంద శాతం గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. రాష్ట్రంలో వినూత్నంగా వీధి దీపాలు ఏర్పాటుచేశాం’ అని చంద్రబాబు వివరించారు.