HomeTelugu Newsఆర్మీని దించే పరిస్థితి తేవొద్దన్న సీఎం కేసీఆర్

ఆర్మీని దించే పరిస్థితి తేవొద్దన్న సీఎం కేసీఆర్

11 20
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించింది. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్నిచోట్ల ప్రజలు నిత్యావసరాల కోసం షాపులపై ఎగబడటంతో ఆందోళన కలిగించే పరిస్థితి. కొంతమంది అనవసరంగా రోడ్లపైకి రావడంతో వారిపై పోలీసులు లాఠీ ఝళిపించారు. అలాంటి వారి వాహనాలను సీజ్ చేసి, పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలుపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మరో 114 మంది కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచంలో 190 దేశాలకు ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులకు సహకరించాలని కోరారు. అమెరికాలో ఆర్మీని రంగంలోకి దించారని, మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితిని తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. మన దగ్గర కంట్రోల్ కాకపోతే షూట్ ఎట్ సైట్, అలాగే ఆర్మీ బృందాలను రంగంలోకి దించాల్సి వస్తుందని తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రజా ప్రతినిధులు సైతం పనిచేయాలని ఆదేశించారు. ఏ ఊరి సర్పంచ్‌ ఆ ఊరికి కథానాయకుడు కావాలన్నారు. కరోనా కట్టడికి ప్రజా ప్రతినిధులంతా వారి పరిధుల్లో రంగంలోకి దిగాలన్నారు.

నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయించే వారిపై పీడీయాక్ట్ పెట్టి దుకాణాలు సీజ్ చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉన్న ఈ సమయంలో వ్యాపారులు నిత్యవసరాలను ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. అత్యవసరమైనవి మినహా ఇతర దుకాణాలన్నీ సాయంత్రం 6 గంటల్లోగా ఎట్టి పరిస్థితుల్లో మూసివేయాలని ఆదేశించారు. తెరిచి వుంటే లైసెన్సులు రద్దుచేస్తామని తెలిపారు. ఇవాళ్టి నుంచి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu