‘కేశవ’గా రానున్న నిఖిల్!

‘స్వామి రారా’.. విడుదలైనప్పుడు చిన్న సినిమానే. మాకు ఇటువంటి సినిమాలే కావాలంటూ ప్రేక్షకులు పెద్ద సినిమా చేసి భారీ విజయం అందించారు. ఈ సినిమాతో యంగ్ హీరో నిఖిల్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ జర్నీ మొదలైంది. సుధీర్ వర్మ అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. ఇప్పుడీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మిస్తున్న ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘కేశవ’ టైటిల్ ఖరారు చేసినట్టు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, అభిషేక్ పిక్చర్స్ సంస్థ అధినేత అభిషేక్ నామా తెలియజేశారు.
నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. ”హుషారైన ఓ కుర్రాడు ఎవరిపై పగబట్టాడు? అసలు పగ, ప్రతీకారాలంటూ ఎందుకు తిరుగుతున్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. అతి త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్లో మరో సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది” అన్నారు.
దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. ”రివెంజ్ డ్రామా స్టోరీ ఇది. నిఖిల్ కొత్త క్యారెక్టర్లో కనిపిస్తాడు. రివెంజ్ డ్రామాలో లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. షూటింగ్ అంతా కాకినాడ నుంచి విశాఖ వరకూ ఉన్న సముద్రతీర ప్రాంతంలో జరుపుతాం” అన్నారు.