కొరటాల శివతో చరణ్ ఈసారి పక్కా!

కొన్ని కాంబినేష‌న్లు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. ఎప్పుడెప్పుడా అని వెయ్య క‌ళ్ల‌తో ఎదురుచూసేలా చేస్తాయి. ఇప్పుడు అధికారికంగా ప్ర‌క‌టిత‌మైన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, హ్యాట్రిక్ హిట్‌ చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న కొర‌టాల శివ కాంబినేష‌న్ అలాంటిదే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లో సినిమా మొద‌లుకానుంది. ఈ ఏడాది ప్రారంభంలో త‌న సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీలో అత్యంత భారీ విజ‌యాన్ని ‘ఖైదీ నంబ‌ర్ 150’ తో సొంతం చేసుకున్నారు రామ్‌చ‌ర‌ణ్‌. ఇప్పుడు అదే సంస్థ‌లో తెలుగు ప్ర‌జ‌లు ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న ‘ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి’ని రూపొందించే ప‌నుల్లో నిమ‌గ్న‌మై ఉన్నారు.

రీసెంట్ గా త‌న‌కు ‘ధృవ‌’తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందించిన సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర పోషిస్తున్న‌ ‘ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి’ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కొణిదెల‌ ప్రొడ‌క్ష‌న్ కంపెనీలో మూడో సినిమాగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తాను న‌టించే సినిమాను నిర్మించ‌నున్నారు రామ్‌చ‌ర‌ణ్‌. ఈ సారి మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డితో చేతులు క‌లిపి నిర్మించ‌నున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ‘క్ష‌ణం’, ‘ఘాజీ’ వంటి కొత్త త‌ర‌హా సినిమాల‌ను రుచి చూపించిన సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ క‌లిసి నిర్మించే రామ్‌చ‌ర‌ణ్ – కొర‌టాల శివ కాంబో సినిమా 2018 వేస‌వికి మొద‌లు కానుంది.