వంగవీటి ఇంటి వద్ద ఉద్రిక్తత

కృష్ణా జిల్లా వైసీపీ లో అసంతృప్తి జ్వాలలు తారా స్థాయికి చేరాయి. విజయవాడ సెంట్రల్ సీటు వంగవీటి రాధాకు కాకుండా మల్లాది విష్ణుకు కేటాయించారని వచ్చిన వార్తలతో రాధా వర్గంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాధాకు వైసీపీ నుంచి విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వాలంటూ ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. ఒక దశలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. అదే సమయంలో రాధా రావడంతో రెచ్చిపోయిన అభిమానులు.. ‘నీ కోసం ప్రాణాలిస్తాం’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అభిమానుల తీరుపై రాధా ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. పెట్రోల్ పోసుకున్న వారిపై రాధా నీళ్లు చల్లి.. ఇది సరైన పద్ధతి కాదని సంయమనం పాటించాలని అభిమానులకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి సైతం ఆందోళన చేస్తున్నవారిని అడ్డుకొని వారికి సర్ది చెప్పారు. ఉదయం నుంచి రంగా, రాధా అభిమానులు నిరసనలు చేపడుతున్నారు.

దీనిపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందిస్తూ.. అనవసరంగా లేనిది ఉన్నట్లు ఊహించుకుని ఆవేశపడటం వల్ల ఉపయోగమేమీ లేదని, అంతా సంయమనం పాటించాలని కోరారు. అధిష్ఠానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని పేపర్లలో చూసి అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీల టిక్కెట్ల కేటాయింపుపై వైసీపీలో ఇంత వరకూ ప్రస్తావనే రాలేదని తెలిపారు. అనవసరంగా ఎవరూ ఆందోళన చెందవద్దని వంగవీటి అభిమానులను మల్లాది కోరారు.