తెలంగాణలో గెలుపు మాదే: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో మంత్రులతో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ వైపు నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం కొన్ని ఛానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటించాయని.. దాదాపు అన్ని సర్వేలూ టీఆర్‌ఎస్‌దే గెలుపని చెప్పాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కానీ ఎగ్జిట్‌పోల్స్‌లో వారు అంచనా వేసిన దానికంటే ఎక్కువ సీట్లు తమకు వస్తాయని.. దాదాపు వందకు పైగా సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులై ఓటుహక్కు వినియోగించుకుని పోలింగ్‌ శాతం పెంచారని పేర్కొన్నారు. ఒక్కచోట కూడా రీపోలింగ్‌ అవసరం లేకుండా ప్రశాంతంగా పోలింగ్‌ ప్రక్రియ ముగియడంపై హర్షం వ్యక్తంచేశారు.

కార్యకర్తలు, నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్‌కి బాగా ఓట్లు పడ్డాయని కేటీఆర్‌ అన్నారు. ఓటింగ్‌ జరిగిన సరళిని పరిశీలిస్తే ప్రజలు ప్రభుత్వానికే అండగా ఉన్నారని తెలుస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ 100కుపైగా స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా ప్రత్యర్థులు టీఆర్‌ఎస్‌పై ఎన్నిరకాల విమర్శలు చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో తమకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. చివరి ఓటు లెక్కబెట్టే వరకూ కూడా అందరూ అప్రమత్తంగా ఉండి ఆ తర్వాత సంబరాలు చేసుకుందామని సూచించారు.

కాంగ్రెస్‌లో హేమాహేమీలుగా పేర్కొన్న నేతలు కూడా గడ్డుకాలం ఎదుర్కోబోతున్నారని కేటీఆర్‌ అన్నారు. తమకు తాము సీఎంలుగా చెప్పుకొనే కాంగ్రెస్‌ నేతలు కొందరు గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ప్రజాకూటమి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజు ఒక రకంగా ఉందని.. ముగిసే రోజున మరో రకంగా ఉందని కేటీఆర్‌ విమర్శించారు. ప్రచారం ముగిసే చివరి రెండు రోజుల్లో చంద్రబాబు ఫొటో లేకుండా ప్రకటనలు ఇచ్చారని గుర్తుచేశారు. దీన్నిబట్టి చంద్రబాబు ప్రచారం వల్ల అపారమైన నష్టం మహాకూటమికి వాటిల్లిందనే విషయం ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు. మహాకూటమిలో పార్టీలది అపవిత్ర.. అవకాశవాద రాజకీయాలతో కూడిన పొత్తుగా అభివర్ణించారు. పత్రికా ప్రకటనల పేరుతో కూటమి నేతలు భారీగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉండబోనుందని.. అది టీఆర్‌ఎస్‌ వైపే ఉండనుందని, అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

పోలింగ్‌ ముగిసిన అనంతరం స్ట్రాంగ్‌రూమ్‌లపై, ఈవీఎంలపై మహాకూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్టూ కుంటి సాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. తాము ప్రజల్లో మాత్రమే స్ట్రాంగ్‌గా ఉన్నామని.. స్ట్రాంగ్‌ రూమ్‌లతో మాకు పనిలేదని చురకలింటించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజగోపాల్‌.. ఫలితాల తర్వాత సర్వేల నుంచి కూడా సన్యాసం తీసుకుంటారని ఎద్దేవా చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates