లేటుగా స్పందించిన లావణ్య త్రిపాఠి.. చెర్రీకీ ధన్యవాలు చెప్పడం మర్చిపోయిందంట!

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000కేఎంపీహెచ్’. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక బుధవారం అట్టహాసంగా జరిగింది. వేడుకకు రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే వేదికపై లావణ్య అందరి గురించి మాట్లాడారు కానీ రామ్‌చరణ్‌కు మాత్రం ధన్యవాదాలు చెప్పడం మర్చిపోయారట.

అందుకే ప్రత్యేకంగా ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ చెర్రీకి ధన్యవాదాలు చెప్పారు. ‘ప్రీ రిలీజ్‌ వేడుకలో నేను కాస్త కంగారుగా ఉన్నాను. దాంతో రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు చెప్పడం మర్చిపోయాను. వేడుకకు వచ్చిన చరణ్‌కు ధన్యవాదాలు. ఆయన వచ్చి మాలో కాన్ఫిడెన్స్‌ను నింపారు. వేడుకను మరింత ప్రత్యేకం చేశారు’ అని పేర్కొన్నారు. ‘అంతరిక్షం’ చిత్రానికి సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అదితి, వరుణ్‌ వ్యోమగాముల పాత్రల్లో నటించారు. ఇటీవల విడదులైన ఈ చిత్ర ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.