ఇంద్రకీలాద్రిపై మహేష్‌బాబు అండ్ టీమ్

మహేష్ బాబు హీరోగా చేసిన మహర్షి సినిమా మే 9 వ తేదీన రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టింది. అన్నిచోట్లా భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాపై తెలంగాణలో మహేష్ అండ్ కో ప్రచారం నిర్వహించారు. సినిమా రిలీజ్ తరువాత ఇలా ప్రచారం చేసి చాలా రోజులైంది. తెలంగాణ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. విజయవాడలోని సిద్దార్ధ కళాశాల మైదానంలో విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు వేలాదిమంది అభిమానులు హాజరవుతారని సమాచారం. ఈ సందర్భంగా విజయవాడ చేరుకున్న మహేష్ బాబు అండ్ టీమ్ అక్కడి నుంచి ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకుంది.

అయితే దుర్గ గుడిలో మాత్రం మ‌హేశ్ బాబు అండ్ టీంకు కాస్త చేదు అనుభ‌వం ఎదురైంది. అక్క‌డికి మ‌హ‌ర్షి యూనిట్ వ‌చ్చింద‌ని తెలుసుకున్న అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. దాంతో ఒక్క‌సారిగా తొక్కిస‌లాట జ‌రిగింది. అక్క‌డే క్యూలో ఉన్న భ‌క్తుల‌కు కూడా మ‌హ‌ర్షి టీమ్ ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మ‌హేశ్ బాబును చూడాల‌నే ఆత్రుతలో ఒక‌రినొక‌రు తోసుకోవ‌డంతో మొద‌టి క్యూలో ఉన్న వాళ్ల‌కు గాయాలు కూడా అయ్యాయి. దాంతో వెంట‌నే గుడి సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆ త‌ర్వాత విష‌యం తెలుసుకున్న మ‌హేశ్ బాబు భ‌క్తుల గురించి ఆరా తీసాడు. ఎవ‌రికీ ఏమీ కాలేద‌ని తెలుసుకున్న త‌ర్వాత అక్క‌డ్నుంచి క‌దిలింది మ‌హ‌ర్షి టీం. ఇక ఈ చిత్ర విజ‌యోత్స‌వ స‌భకు విజయవాడలో భారీగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.