నా ఫేవరేట్‌తో మరోసారి: మహేశ్‌బాబు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ ప్రాజెక్ట్‌ కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. మహేశ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఓ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టల్‌కు సంబంధించిన షూట్‌ జరుగుతోంది. ఈ ప్రకటనను త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫొటోను మహేశ్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘నా ఫేవరేట్‌తో మరోసారి. ఆయనతో కలిసి పనిచేస్తే కలిగే అనుభూతి నాకెప్పుడూ నచ్చుతుంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఫొటోకు ట్విటర్‌లో 31వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. త్రివిక్రమ్‌, మహేశ్‌ కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. మరోసారి వీరిద్దరూ కలిసి వెండితెరపై సందడి చేయాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం మహేశ్‌.. ‘మహర్షి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల సినిమాలోని తొలి పాట, టీజర్‌ విడుదలయ్యాయి. 12న సాయంత్రం 4.05 గంటల సమయంలో రెండో పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోపక్క త్రివిక్రమ్‌.. అల్లు అర్జున్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. 24 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది.