HomeTelugu Big StoriesMangalagiri Constituency: ఆసక్తిరేపుతున్న పరిణామాలు.. నారా లోకేష్ గెలుస్తారా?

Mangalagiri Constituency: ఆసక్తిరేపుతున్న పరిణామాలు.. నారా లోకేష్ గెలుస్తారా?

Mangalagiri Constituency

Mangalagiri Constituency: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి బరిలో ఎవరు గెలవబోతున్నారు. టీడీపీ తరపున నారా లోకేష్ బరిలో నిలవగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. మంగళగిరిలో 2014, 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అయితే ఈసారి ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపుతారో ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఈ నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై 5 వేల ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు.

గత ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ మంగళగిరి నియోజకవర్గం ప్రజలతో మమేకమై ఉంటున్నారు నారా లోకేష్. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సొంత నిధులతో నియోజకవర్గానికి సేవలు చేశారు. మరోవైపు గత రెండుసార్లు నియోజకవర్గంలో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా వెల్లువెత్తుతోంది. నియోజకవర్గం అభివృద్ధిని గాలికొదిలేశారని, ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.

అయితే ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి మురుగుడు లావణ్యను బరిలోకి దింపింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి సడన్‌గా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. 2 నెలలు తిరగకుండానే మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. అయినా గానీ మంగళగిరి సీటు మాత్రం దక్కించుకోలేకపోయారు. మురుగుడు లావణ్యను మంగళగిరి బరిలో దింపారు. గతంలో వైఎస్‌ఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన మురుగుడు హనుమంతరావు కోడలు, అలాగే కాంగ్రెస్‌లో 2009లో మంగళగిరి నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన కాండ్రు కమల కూతురు మురుగుడు లావణ్య.

మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం 2,68,429 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గం ఓట్లు సుమారు 80 వేలకు పైగా ఉంటాయి. మురుగుడు లావణ్య రాజకీయ నేపథ్యం ఉన్న రెండు కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ నియోజకవర్గంలోని ప్రజలకు ఎక్కువగా తెలియకపోవడం ఆమెకు మైనస్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే గతంలో నారా లోకేష్ ఓడిపోవడానికి గంజి చిరంజీవి పాత్ర ఉందని, ఆయనకు టికెట్ ఇవ్వకపోవడమే దానికి కారణమని ఆ నియోజకవర్గంలోని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈసారి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ ఎన్నికల్లో సీటు రాలేదన్న వ్యతిరేక భావం కూడా అతడు కాంగ్రెస్‌లో చేరేందుకు కారణమని ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో గంజి చిరంజీవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇద్దరూ మురుగుడు లావణ్యకు సహకరిస్తారా.. ఆమె విజయానికి కృషి చేస్తారా అనేది డౌటేనని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.

2019లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఓడిపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. నియోజకవర్గంలో తన సొంత నిధులతో పలు అభివద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మనసులు గెలుచుకున్నాడని అంటున్నారు. మహిళలకు కుట్టు మిషన్లు, పేదలకు, చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడం వంటి పలు సహాయ కార్యక్రమాలు చేపట్టారు నారా లోకేష్. ఇవన్నీ కూడా లోకేష్‌కు ఈసారి గెలుపునకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. యువగళం పాదయాత్ర కూడా నారా లోకేష్‌కు ఏపీలో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత లోకేష్‌కు బాగా కలిసొచ్చే అంశం.

రాష్ట్రం మొత్తం మీద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న వ్యతిరేకతతో ఈసారి ప్రజలు నారా లోకేష్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అందులోనూ గతంలో ఓడిపోయిన సానుభూతి కూడా ప్రజల్లో ఎక్కువగా ఉంది. గత ఐదేళ్లుగా స్థానిక ప్రజలతో టచ్‌లో ఉండటం లోకేష్‌కు కలిసొచ్చే అంశం. మరి ఈసారైన లోకేష్‌కు ఛాన్స్‌ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu