ఎన్టీఆర్‌ ‘నా ప్రాణం’:మనోజ్‌

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌.. ప్రముఖ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే తనకు ప్రాణమని అంటున్నారు. వీరిద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. మనోజ్‌ సమయం దొరికినప్పుడల్లా తారక్‌ ఇంటికి వెళ్లి వస్తుంటారు. అభయ్‌తో బాగా ఆడుకుంటుంటారు. కాగా సోమవారం ట్విటర్‌లో కొందరు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు మనోజ్‌ సమాధానం ఇచ్చారు. ‘మనోజ్‌ భయ్యా ఎన్టీఆర్‌ గురించి ఒక్కమాటలో చెప్పండి’ అని ప్రశ్నించగా.. ‘నా ప్రాణం’ అని నవ్వుతూ జవాబిచ్చారు. మీ తర్వాతి పని సినిమాలా, రాజకీయాలా అని అడగగా.. ‘సందేహం లేదు సినిమాలే’ అన్నారు. మరో నెటిజన్‌ మనోజ్‌ ఏ రంగంలో కొనసాగినా మద్దతుగా ఉంటామని అన్నారు. సినిమాలైనా, రాజకీయాలైనా, సామాజిక సేవ అయినా వెన్నంటే ఉంటామన్నారు. దీనికి మనోజ్‌ ఆనందంతో ధన్యవాదాలు తెలిపారు.

మరోపక్క ఈ వీకెండ్‌ను ఆది, శింబు తదితర స్నేహితులతో గడిపినట్లు మనోజ్‌ చెప్పారు. శింబుతో కలిసి టేబుల్‌ టెన్నిస్‌ ఆడుతున్న వీడియోను షేర్‌ చేశారు. శింబు తన కోసం స్ఫూర్తిదాయకమైన పాటల్ని రూపొందించారని, అవి తన మనసును తాకాయని అన్నారు.

హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లనున్నట్లు ఇటీవల మనోజ్‌ చెప్పారు. అక్కడే కొన్ని నెలలు ఉండబోతున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ నుంచి ప్రజలకు సేవ చేయడం ప్రారంభిస్తానని, ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ కొనసాగిస్తానని పేర్కొన్నారు. దీంతో మనోజ్‌ సినిమాల్ని పక్కన పెట్టి.. రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారని అందరూ అభిప్రాయపడ్డారు.