ప్రణయ్‌ పరువు హత్యపై మనోజ్‌ ట్వీట్‌ వైరల్‌

ఇటీవల నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ప్రాంతానికి ప్రణయ్ పరువు హత్యపై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన పై హీరో మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కులం, మతోన్మాదంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఈ ఘటనపై ట్విటర్‌ ద్వారా మంచు మనోజ్ తన మనసులోని ఆవేదనను, బాధను వ్యక్తం చేసారు. ప్రణయ్‌ హంతకులనుద్దేశించి ఈ ట్వీట్‌ అంటూ ఒక పోస్ట్‌ పెట్టారు. కులాల పేరుతో ఎందుకీ వివక్ష, హత్యలు అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. మానవత్వం కంటే మతం కులం ఎక్కువా? మనమంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పటికి గుర్తిస్తుందంటూ ఆవేదనతో ప్రశ్నించారు. కుల దురహంకార హత్యలను తీవ్రంగా ఖండించిన మనోజ్‌ హత‍్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృతకు, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

కులం, మతం పిచ్చోళ్లు సమాజంలో ఉండటం వల్లనే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుల అహంకారాన్ని తలకెక్కించుకుని కుల మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతీ వ్యక్తి ప్రణయ్‌ హత‍్యకు బాధ్యులేనన్నారు. అందుకే ఓ బిడ్డ ఇంకా లోకం చూడకుండానే తన తండ్రి స్పర్శను కోల్పోయింది. ఇంతకంటే విషాదం ఎవరి జీవితాల్లోనైనా ఏముంటుందని వ్యాఖ్యానించారు. కులోన్మాదుల్లార సిగ్గుపడండి.. గుర్తుంచుకోండి..కులాన్ని సమర్ధిస్తున్న మీరందరూ ప్రణయ్‌ హత్యకు బాధ్యులే. ఇకనైనా కళ్లు తెరవండి. మనుషులుగా బతుకండి..కులవ్యవస్థ నాశనం కావాలి. ఆ అంటురోగాన్ని ముందుగానే నిరోధించాలి. హృదయపూర్వకంగా మీ అందరినీ అడుగుతున్నా.. మన బిడ్డలకు మెరుగైన సమాజాన్ని అందిద్దాం అంటూ ఉద్వేగంతో చేసిన ట్వీట్‌ ఇపుడు వైరల్‌ అవుతోంది. పరువు పేరుతో కన్న కూతురి జీవితాన్ని అతలాకుతలం చేసిన వైనంపై దళిత, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. మారుతీరావు సహా నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి