మత్తు వదలరా మూవీ రివ్యూ

ప్రముఖ గాయకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా తెరకెక్కిన ‘మత్తు వదలరా’ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. కీరవాణి మరో కుమారుడు కాలభైరవా ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందామా…

కథ: శ్రీసింహ డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. నెలమొత్తం కష్టపడినా వచ్చే జీతం జీవితం గడిపేందుకు సరిపోదు. పైగా శ్రీసింహకు అతినిద్ర అనే జబ్బు ఉంటుంది. దీనికారణంగా కోపం, అసహనం, నిరాశా అనే లక్షణాలు అలవడతాయి. తన స్నేహితులైన సత్య, అగస్త్యతో కలిసి రూమ్ లో ఉంటాడు. సత్య కూడా డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. ఓరోజు సత్య ఇచ్చిన ఐడియాతో ఈజీగా కష్టమర్లను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. అలా అనుకోకుండా ఓ అపార్ట్మెంట్ కు వెళ్లిన శ్రీ సింహా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ మర్డర్ ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డారు అన్నది కథ.

విశ్లేషణ: క్రైమ్ థ్రిల్లర్ జానర్ అయినప్పటికీ కొత్త అనుభూతిని కలిగించేందుకు దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. కథను పక్కదోవ పట్టించకుండా, కథలోకి కావాలని కామెడీని ఇరికించకుండా ఫుల్ ఫన్ క్రియేట్ చేయడం చాలా కష్టమైన విషయం. కానీ, కష్టమైనా సమర్ధవంతంగా చేసి చూపించారు. ఎక్కడా ఫీల్ మిస్ కానివ్వలేదు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను తీసిన విధానం థియేటర్లో విజిల్స్ వేయిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కార్డు వరకు ప్రేక్షకుడిని సీట్లో నుంచి లేవనివ్వకుండా కూర్చోపెట్టడం అంటే మాములు విషయం కాదు. దర్శకుడు అదే చేసి నిరూపించాడు.

మర్డర్ మిస్టరీ చుట్టూనే కథ నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. క్లైమాక్స్ లో మోడీ తీసుకునే నిర్ణయంతో ఎండ్ చేయడం మరో విశేషం. కేవలం కథ, కథనాలే సినిమాలో హీరో. హీరో హీరోయిజం చూపించడం లాంటివి సినిమాలో కనిపించవు. మొత్తానికి కుర్రాళ్లతో చేసిన ప్రయోగం టాలీవుడ్ మత్తు వదలగొట్టింది.

నటీనటుల పనితీరు: శ్రీసింహా కొత్తవాడైనప్పటికి మెప్పించాడు. తన మేకోవర్, నటనతో ఆకట్టుకున్నాడు. కమెడియన్ సత్య తన కామెడీతో కడుపుబ్బా నవ్వించి మెప్పించాడు. థ్రిల్లింగ్ జానర్ అయినప్పటికీ నవ్వుల టపాసులతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు కూడా తనదైన శైలిలో మెప్పించారు. డైరెక్టర్‌ రితేష్ రాణా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎంచుకున్న కథ, కథనాలు ఫ్రెష్ గా ఉండటం.. దాదాపుగా సినిమాలో అందరూ కొత్తవాళ్లే కావడంతో సినిమాకు ఫ్రెష్ లుక్ వచ్చింది. సినిమాను తీసిన విధానం, పాత్రలను నడిపించిన తీరుకు దర్శకుడిను మెచ్చుకోవాలి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం. సురేష్ సినిమాటోగ్రఫీతో ఆకట్టుకుంటే, కాలభైరవా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మాయ చేశాడు.


హైలైట్స్‌ :శ్రీసింహా నటన
సినిమాలో కొత్తదనం

డ్రాబ్యాక్స్ : కమర్షియల్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం

టైటిల్ : మత్తు వదలరా
నటీనటులు: శ్రీసింహా, వెన్నెల కిశోర్‌, సత్య, అగస్త్య, బ్రహ్మాజీ
దర్శకత్వం : రితేష్‌ రానా
నిర్మాత : చిరంజీవి (చెర్రీ), హేమలత
సంగీతం :కాలభైరవ

చివరిగా : కొత్తగా.. గ‘మ్మత్తు’గా ఉంది.
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)