‘మైఖేల్’ మూవీ రివ్యూ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. అలాంటి కథ ‘మైఖేల్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం ఆయన 20 కేజీల బరువు తగ్గాడు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నడిచే ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులకు కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.

కథ: 1990 లలో జరిగే కథ ఇది. మైఖేల్ (సందీప్ కిషన్) పది .. పన్నెండేళ్ల వయసు నాటికే జీవితంలో ఎన్నో దెబ్బలు తినేసి ఉంటాడు. దాంతో ఆయనలో ఒక రకమైన తెగింపు చోటుచేసుకుంటుంది. తన తండ్రిని చంపాలనే ఆవేశంతో ఆ వయసులోనే ఆయన ముంబైకి చేరుకుంటాడు. అక్కడి మాఫియా సామ్రాజ్యాన్ని గురునాథ్ ( గౌతమ్ మీనన్) శాసిస్తుంటాడు. ఆయన భార్య చారుమతి (అనసూయ), కొడుకు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్). ఆ ఇద్దరూ అంటే గురునాథ్ కి ప్రాణం.

అలాంటి గురునాథ్ ప్రాణాలు కాపాడిన మైఖేల్ ఆయన బృందంలో చోటు దక్కించుకుని, ఆయనకు నమ్మకస్తుడిగా ఎదుగుతాడు. అయితే ఇది గురునాథ్ కొడుకైన అమర్ నాథ్ కి నచ్చదు. అలాగే తనని పక్కన పెడుతున్న తండ్రి తీరు కూడా అతనికి అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గురునాథ్ హత్యకి కుట్ర జరుగుతుంది. ఆ హత్యను ప్లాన్ చేసిన రతన్ (అనీష్ కురువిళ్ల)ను .. ఆయన కూతురు ధీర ( దివ్యాన్ష) ను అంతం చేయమని చెప్పి మైఖేల్ ను గురునాథ్ ఢిల్లీకి పంపిస్తాడు.

అక్కడికి వెళ్లిన మైఖేల్ .. ధీర ప్రేమలో పడిపోయి వచ్చిన పని పక్కన పెడతాడు. అంతేకాదు ఆ సమయంలోనే జరిగిన ఒక అనూహ్యమైన సంఘటన కారణంగా మైఖేల్ నే అంతం చేయమని గురునాథ్ తన మనుషులను పురమాయిస్తాడు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? మైఖేల్ తండ్రి ఎవరు? .. ఆయనపై అతనికి గల కోపానికి కారణం ఏమిటి? మైఖేల్ జీవితంలోకి కన్నమ్మ దంపతులు (విజయ్ సేతుపతి – వరలక్ష్మి శరత్ కుమార్) ఎలా ఎంట్రీ ఇస్తారు? వంటి మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

విశ్లేషణ: డైరెక్టర్‌ రంజిత్ జయకోడి ఎంచుకున్న కథలో ఎక్కడ కొత్తదనం కనిపించదు. ప్రీ క్లైమాక్స్ వరకూ కూడా ఎలాంటి ట్విస్టులు లేకుండా కథ చాలా సాదాసీదాగా సాగుతూ ఉంటుంది. మొదటి భాగం అంతకూడా చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఆయా ప్రధానమైన పాత్రలకు ఆయన నటీనటులను ఎంచుకున్న తీరు బాగుంది. అయితే సందీప్ కిషన్ పాత్రతో సహా, దివ్యాన్ష .. అనసూయ పాత్రలను ఆయన సరిగ్గా డిజైన్ చేయలేదు. ఇక విజయ్ సేతుపతి పాత్ర ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పాలి. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలను డిజైన్ చేసిన తీరు ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే ఆ ఇద్దరి పాత్రల ఎంట్రీ చాలా లేటుగా జరుగుతుంది. ప్రీ క్లైమాక్స్ కి కాస్త ముందు వాళ్లు ఎంట్రీ ఇవ్వడం వలన, ఆ పాత్రలను ఎలివేట్ చేయడానికి తగినంత సమయం లేదు. ఇక ఉన్న సమయాన్నంతా యాక్షన్ కే ఎక్కువగా సమయం కేటాయించారు. ఎమెషన్‌కు పెద్దగా టైమ్‌ ఇవ్వలేదు. ఇక నటీనటులు ఎవరిపాత్ర పరిధిలో వారు నటించారు. సందీప్ కిషన్ పాత్రకి పెద్దగా డైలాగ్స్ లేకుండా కొత్తగా చూపించడానికి ట్రై చేశారు. సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. యాక్షన్ సీన్స్ ను ఆయన నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. సంగీతం పర్వలేదు. కెమెరా పనితనం ఓకే.

ఇక డైలాగ్స్ విషయానికొస్తే సందీప్ కిషన్ పాత్ర స్థాయిని దాటి .. ఆయనకి గల క్రేజ్ ను దాటి కొన్ని డైలాగులు ఉన్నాయి. బిల్డప్ కోసం రాసిన కొన్ని డైలాగులు కాస్త అతిగా అనిపిస్తాయి.

టైటిల్‌ :’మైఖేల్’
నటీనటులు: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, గౌతం మీనన్, వరుణ్ సందేశ్, అనసూయ, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు
నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
దర్శకత్వం: రంజిత్ జయకోడి
సంగీతం: సామ్ సిఎస్

హైలైట్స్‌‌: విజయ్‌ సేతుపతి నటన
డ్రాబ్యాక్స్‌: కథలో కొత్తదనం లేకపోవడం

చివరిగా: రొటీన్‌ స్టోరీ
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates