ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ వీడుతారంటూ వస్తోన్న ఊహాగానాలకు చెక్‌పెడుతూ బీజేపీని వీడుతున్నట్టు స్పష్టంచేశారు. బుధవారం రాత్రి ఆయన ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ.. ఈ నెల 21న జనసేనలో చేరుతున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని, ప్రధానంగా మూడు అంశాల్లో అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్‌ప్లాంట్ మంజూరు చేయకుండా అన్యాయం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని, ఆయన ఏ పదవి ఇచ్చినా స్వీకరించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా తాను జనసేనలో చేరుతున్నట్టు ఆకుల సత్యనారాయణ వెల్లడించారు.













