ఆ సినిమా విషయంలో నాగ్ పునరాలోచన!

అక్కినేని నాగార్జున తన కెరీర్ లో ఎప్పుడు 50 కోట్ల క్లబ్ లోకి వెళ్లలేదు. అయితే ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాతో నాగార్జునకు ఆ ఘనతను దక్కించాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఆ సినిమా సమయంలో కల్యాణ్ కృష్ణ.. నాగార్జునతో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. నాగార్జున కూడా పలు సంధార్భాల్లో ఈ సినిమా గురించి ప్రస్తావించాడు. అయితే తన కొడుకు నాగచైతన్యకు మంచి హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కల్యాణ్ కృష్ణను ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయమని అడిగాడు. నాగార్జునతో ఎలాగో ‘బంగార్రాజు’ సినిమా ఉంటుంది కదా అని చైతుతో సినిమా చేయడానికి అంగీకరించాడు కల్యాణ్ కృష్ణ. అయితే ఈ సినిమా విషయంలో చాలా వరకు నాగ్ ఇన్వాల్వ్ అయ్యేవారు. 
చాలా సన్నివేశాలు ఆయన ఇష్టంమేరకు మార్చారు. ఫైనల్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా నాగ సూచనలు పాటించారు. ఇంతా చేస్తే సినిమా రిజల్ట్ మాత్రం ఏవరేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు నాగార్జున, కల్యాణ్ తో పని చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని టాక్. కల్యాణ్ కథ మొత్తం సిద్ధం చేసుకొని వినిపించాలనుకున్నా.. నాగార్జున మాత్రం దొరకడం లేదట. కల్యాణ్ కృష్ణతో సినిమా విషయంలో నాగ్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. అయితే ఈ కథపై నమ్మకంతో ఉన్న కల్యాణ్ కృష్ణ ఎలాగైనా.. నాగ్ ను ఒప్పించి సినిమా చేయాలని చూస్తున్నాడు. మరి నాగార్జున కనికరిస్తాడో.. లేదో.. చూడాలి!