ఏపీలో కాపు వర్గం ఓట్లు ఏ పార్టీకి?

ఏపీలో అధికారం చేజిక్కించుకోవడానికి కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకం కావడంతో వారి ఓట్లుసాధించేందుకు అధికార టీడీపీ, జనసేన, వైసీపీ తర్జనబర్జన పడుతున్నాయి. కాపులకు ఎవరు రిజర్వేషన్లు కల్పిస్తారో ఆ పార్టీకే మద్దతు ఇచ్చే యోచనలో కాపు నేతలున్నారు. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని చంద్రబాబు తన పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. కాపు రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే తమ ప్రభుత్వమని చెబుతున్నారు. కాపులకు టీడీపీ మాత్రమే న్యాయం చేయగలదని అంటున్నారు. మరోవైపు జగన్ తాను కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాననే అబద్ధపు వాగ్దానాలు చేయలేనని.. అది తమ పరిధిలోని అంశం కానందున మాట ఇచ్చి తప్పలేనని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్లపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

కాపులకు రిజర్వేషన్‌లు తన పరిధిలోని అంశం కాదని, కాపు రిజర్వేషన్‌లపై తాను హామీ ఇవ్వలేనని వైఎస్ జగన్‌ వెల్లడించాక టీడీపీ, జనసేనకు ఏ ఏజ్‌ గ్రూపువారు ఓట్లు వేయవచ్చనేదానిపై ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. 25ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు జనసేనకు ఓట్లు వేస్తారని, 25-40 ఏళ్ల లోపు వారు, 40 ఏళ్లకు పైబడినవారు ఇతర పార్టీలకు వేస్తారని ప్రచురించింది. 40 ఏళ్లకు పైబడినవారు టీడీపీకి ఓటేస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిదని జగన్‌ చెప్పడంతో 25 నుంచి 40 ఏళ్ల వారి ఓట్లు సాధించాలని టీడీపీ, జనసేన పోటీ పడతాయి. 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారి ఓట్లు తప్పనిసరిగా తమకే పడతాయని జనసేన నేతలు చెబుతున్నారు. రిజర్వేషన్‌లు సాధించడం తనవల్ల అయ్యే పనికాదని జగన్‌ చెప్పాడు కాబట్టి 25-40 ఏజ్‌ గ్రూపును కూడా టార్గెట్‌ చేసుకున్నామన్నారు. ఏ ఏజ్‌ గ్రూపు వారు తమకు ఓట్లు వేస్తారని వైసీపీ భావిస్తున్నదో ఈ కథనం తెలపలేదు.

కేంద్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి, రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేకహోదా తప్పకుండా వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాపు రిజర్వేషన్లు అమలు చేయగలిగేది కూడా తమ ప్రభుత్వమేనని రాష్ట్ర కాంగ్రెసు నేతలు అంటున్నారు. కాపు రిజర్వేషన్లు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే సత్తా కాంగ్రెస్‌కే ఉందని చెబుతున్నారు.