సోనాలిని కలిసిన నమ్రతా శిరోద్కర్

క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ నటి సోనాలి బింద్రేకు తాను మాటిచ్చానని అంటున్నారు సినీ నటి, మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌. మహేశ్‌ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం అమెరికాలో విహారయాత్ర చేస్తున్నారు. సోనాలి బింద్రే న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా నమ్రత.. సోనాలిని కలిసి ఆమెను పరామర్శించారు. ఈ విషయాన్ని నమ్రత ఆంగ్ల ‘మీడియా ద్వారా వెల్లడించారు.

‘సోనాలి దృఢమైన మహిళ. చికిత్స పొందుతున్నప్పటికీ ఆమె ఫిట్‌గా ఉన్నారు. త్వరలో మామూలు జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉన్నారు. సోనాలితో కలిసి కాసేపు సరదాగా గడిపాను. చాలా విషయాలను మాట్లాడుకున్నాం. తన అనారోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలను నాకు చెప్పారు. తాను బలంగా ఉండటానికి ఏం చేస్తున్నారో కూడా వెల్లడించారు. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటానని సోనాలికి చెప్పాను. నేను సోనాలిని, ఆమె కుటుంబాన్ని మరోసారి కలవాలనుకున్నాను. మేమిద్దరం కలిసి సెంట్రల్‌ పార్క్‌లో వాకింగ్‌ చేయాలనుకున్నాం. కానీ పని నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. త్వరలో సోనాలిని మళ్లీ కలుస్తానని, సెంట్రల్‌ పార్క్‌లో వాకింగ్‌కి వస్తానని తనకు మాటిచ్చాను’ అని తెలిపారు నమ్రత. మహేశ్‌బాబుకు జోడీగా సోనాలి బింద్రే ‘మురారి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.