ప్రతి సినిమా ప్రయత్నమే!

నారా రోహిత్, రెజీనా జంటగా శ్రీ లీలా మూవీస్ ప‌తాకంపై జె.ఆర్‌.మీడియా ప్రై.లిమిటెడ్‌తో క‌లిసి ఆర్.వి.చంద్ర‌మౌళి ప్ర‌సాద్ (కిన్ను) నిర్మించిన చిత్రం ‘శంకర’. తాతినేని స‌త్యప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ విలేకర్లతో ముచ్చటించారు.
శంకర ఎలా ఉండబోతోంది..?
ఇది హీరో సెంట్రిక్ మూవీ. యూనివర్శ‌ల్ కంటెంట్ ఉన్న చిత్రం. ఒక కాలేజీ అబ్బాయి త‌న‌కు సంబంధం లేని ఇష్యూలో ఇరుక్కుంటాడు. ఆ సమస్యలను ఎలా ఎదిరించాడనేది కథ. నేను ఇప్పటివరకు స్టూడెంట్ పాత్రలో నటించలేదు. ఇదే మొదటిసారి. చాలా సిన్సియర్ గా చదువుకునే అబ్బాయి పాత్రలో కనిపిస్తా..
సినిమా రిలీజ్ కు బాగా లేట్ అయింది. కాన్సెప్ట్ పరంగా ఎలాంటి ఇబ్బందులైనా ఉంటాయా..?
త‌మిళంలో ఈ సినిమా 2011లో విడుద‌లైంది. బాలీవుడ్‌లో ఈ మ‌ధ్య విడుద‌ల చేశారు. ముందే చెప్పిన‌ట్టు యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్ కాబ‌ట్టి ఎక్క‌డా ఫేడ్ కాదు. కాక‌పోతే అప్పుడు కాస్త బరువు తగ్గి ఉన్నాను.. ఇప్పుడు కొంచెం లావు అయ్యాను(నవ్వుతూ..)
సోషల్ మెసేజ్ ఏమైనా చెప్తున్నారా..?
అలాంటిదేమీ ఉండ‌దండీ. స్టూడెంట్‌కి, పోలీసుకు మ‌ధ్య జ‌రిగే వార్ ని చూపించాం.
సినిమాలో నటించేప్పుడు మీ కాలేజీ రోజులు గుర్తొచ్చాయా..?
మా కాలేజ్ లో అందరు చదువుకునే వాళ్ళే ఎక్కువగా ఉండేవారు. నేను అంత సిన్సియర్ గా చదవను. అలా అని బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ను కాదు.. బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే ప్రశ్నలు వేస్తారని ఎప్పుడు ఫస్ట్ బెంచ్ లోనే కుర్చునేవాడ్ని. ఈ సినిమాలో హీరో చ‌దివిన‌ట్టు చ‌దివిన‌ట్ట‌యితే ఏ సైంటిస్టో అయ్యేవాడిని.
మీకోసం కథలు రాయమని ఎవరైనా దర్శకులను కలుస్తారా..?
నాకోసం కథలు రాయించడం నాకు నచ్చదు. కథను నేను సూట్ అవుతానని వారికి అనిపిస్తే వారే నా
దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇప్పటివరకు అలా వచ్చిన సినిమాల్లో నుండే నేను ఎంపిక చేసుకొని నటిస్తూ వస్తున్నాను.
తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులేమైనా చేశారా..?
నేటివిటీ పరంగా చాలా మార్పులే చేశాం. అక్క‌డ ఓ 40 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. దాన్ని మేం నాలుగు నిమిషాల పాట‌లో పెట్టేశాం. త‌మిళంలో హీరోయిజం త‌క్కువ‌గా ఉంటుంది. మిగిలిన పాత్ర‌లు కూడా లీడ్ చేస్తుంటాయి. కానీ ఇక్క‌డ క‌మ‌ర్షియ‌ల్‌గా ఉండాలని హీరోయిజాన్ని పెంచారు.
మీకు సినిమాల కోసం ఫండింగ్ ఇచ్చేవాళ్ళున్నారని విన్నాం నిజమేనా..?
నేను దాదాపు అందరు కొత్తవాళ్ళతోనే పని చేశాను. నేను నటించిన కొన్ని సినిమాలు సరైన ప్రమోషన్ లేక సరిగ్గా ఆడలేదు. నాకు ఫండింగ్ ఇచ్చే వాళ్ళే ఉంటే ప్రమోషన్స్ ఎందుకు చేయను.
ఫ్లాప్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు..?
మనం అనుకున్నట్లు ఏది జీవితంలో జరగదు. అంతా కలిసి రావాలి. సినిమా రిజల్ట్ ఏంటనేది ఎవరు చెప్పలేరు. ప్రతి సినిమా ప్రయత్నమే.. కథను నమ్మి సినిమా చేస్తారు. ఫైనల్ గా రిజల్ట్ అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది.
ఎక్కువ సినిమాలు చేస్తుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదా..?
ఇక కాస్త నిదానంగానే చేస్తా. ఒక సినిమా విడుద‌లైన త‌ర్వాత మ‌రో సినిమా విడుద‌ల‌య్యేలా ప్లాన్ చేసుకుంటా. సినిమాలు ఒక‌దానిపై ఒక‌టి ఓవర్ ల్యాప్ కావ‌డాన్ని నేను కూడా గ‌మ‌నిస్తూనే ఉన్నాను.
బరువు తగ్గుతున్నట్లున్నారు..?
ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు నా బరువుకి ఎలాంటి సంబంధం లేదు. అందుకే అవసరం రాలేదు. తాజాగా రెండు కమర్షియల్ సినిమాలు ఒప్పుకున్నాను. వాటి కోసం ఖచ్చితంగా బరువు తగ్గాల్సిందే.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
పండగలా వచ్చాడు సినిమా క్లైమాక్స్ చిత్రీకరించాలి. అది కాకుండా అప్పట్లో ఒక‌డుండేవాడు, క‌థ‌లో రాజ‌కుమారి, పవన్ సాధినేని దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ సంస్థ‌లో ఓ సినిమా.. ఇవి కాక ఇంకో రెండు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేస్తున్నాను.