పుట్టినరోజు సందర్భంగా న్యూయార్క్‌లో ప్రియుడితో నయన్‌!

స్టార్‌ హీరోయిన్‌ నయనతార తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివాన్‌తో కలిసి న్యూయార్క్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో నయన్‌తో సన్నిహితంగా తీసుకున్న ఫొటోల్ని విఘ్నేశ్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఆమె తన జీవితంలోకి రావడం అదృష్టమని అభిప్రాయపడ్డారు. ఓ సందర్భంలో మీడియా ఎదుట నయన్‌తో పెళ్లి గురించి ప్రశ్నించగా.. ‘అది ఆమెనే అడగండి’ అని ఆయన సమాధానం ఇచ్చారు. ఓ అవార్డుల కార్యక్రమంలో నయన్‌ తనకు కాబోయే భర్త విఘ్నేశ్‌ అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమపై అందరూ క్లారిటీకి వచ్చేశారు.

సోమవారం నయన్‌ తన 34వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో విఘ్నేశ్‌, నయన్‌ న్యూయార్క్‌కు వెళ్లారు. నయన్‌తో ఉన్న ఫొటోను దర్శకుడు పంచుకుంటూ.. ‘ఈ ఆకాశం, ఆమె చిరునవ్వు.. నిజమైనవి. నయనతార పుట్టినరోజు సందర్భంగా న్యూయార్క్‌ నగరానికి వచ్చాం. ఈ నగరం అంటే మాకు ఎంతో ఇష్టం. చాలా అందంగా ఉంటుంది’ అని పోస్ట్‌ చేశారు. అంతేకాదు ఈ ట్రిప్‌లో నయన్‌ జంట నిర్మాత బోనీ కపూర్‌, ఆయన కుమార్తె ఖుషి కపూర్‌లను కలిసింది. ఖుషి శిక్షణలో భాగంగా ఇటీవల న్యూయార్క్‌కు వెళ్లారు. వారితో కలిసి డిన్నర్‌ చేసినట్లు విఘ్నేశ్‌ తెలిపారు.