ఒళ్లు గగుర్పొడిచేలా ‘నిను వీడని నీడను నేనే’ ట్రైలర్‌

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నిను వీడని నీడను నేనే’. ఈ చిత్రానికి కార్తిక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో సందీప్‌ కిషన్‌ అద్దంలో తనని తాను చూసుకుంటున్నప్పుడు తన రూపం కాకుండా వెన్నెల కిశోర్‌ ప్రతిరూపం కనిపిస్తుంటుంది. ‘400 సంవత్సరాలకు పూర్వం గ్రీస్‌లోని ఓ గ్రామంలో ఓ బాలుడికి అద్దంలో ఓ పెద్దాయన రూపం కనిపిస్తుండేది. దాంతో ఆ గ్రామ ప్రజలు భయపడి ఆ పిల్లాడిని చంపేశారు. ఎక్కడో చదివిన ఈ విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తున్నా’ అని ఓ చర్చి ఫాదర్‌ చెబుతున్న డైలాగ్‌, భయంకరమైన సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ‘పోలీసులకు మాత్రం దెయ్యం అంటే భయం ఉండదా? దెయ్యాల్ని పట్టుకోవడానికి మాకేమన్నా స్పెషల్‌ ట్రైనింగ్‌ ఇస్తారనుకుంటున్నారా?’ అంటూ పోసాని కృష్ణమురళి భయపడుతూ చెబుతున్న డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది. ఈ చిత్రంలో అన్య సింగ్‌ హీరోయిన్‌గా నటించారు. మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్‌, ప్రగతి, రాహుల్‌ రామకృష్ణ సహాయ పాత్రల్లో నటించారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.