HomeTelugu Big Storiesనిర్భయ దోషుల ఉరితీతకు కొత్త తేదీ ఖరారు..

నిర్భయ దోషుల ఉరితీతకు కొత్త తేదీ ఖరారు..

10 11
ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతకు కొత్త తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు తాజాగా మరోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.

ఈ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు తిరస్కరించారు. దీంతో తాజా డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరుతూ తిహాడ్‌ జైలు అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారని, అందువల్ల దోషుల ఉరితీతకు కొత్త తేదీ, సమయం చెబుతూ డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని తిహాడ్‌ అధికారుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ న్యాయస్థానాన్ని కోరారు. అయితే క్షమాభిక్ష పిటిషన్‌ కొట్టివేత గురించి దోషి ముఖేశ్‌కు సమాచారమిచ్చేందుకు కోర్టు జైలు అధికారులకు సాయంత్రం 4.30 గంటల వరకు సమయమిచ్చింది. దీంతో అధికారులు ముఖేశ్‌కు అధికారికంగా సమాచారమిచ్చారు. అనంతరం ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో కొత్త డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.

మరోవైపు ఈ కేసులో మరో దోషి అయిన పవన్‌ గుప్తా మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఘటన సమయంలో తాను జువైనల్‌ అని, దాని ఆధారంగానే విచారణ జరపాలని అభ్యర్థించాడు. 2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై ఢిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. ఆ తర్వాత ఢిల్లీ పటియాలా కోర్టు వీరికి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాలని ఆదేశించింది. న్యాయపరమైన అవకాశాల కోసం 14 రోజుల గడువు కల్పించింది. దీంతో దోషుల్లో ఇద్దరు సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని కూడా సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో చివరి ప్రయత్నంగా ముఖేశ్‌ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. దీంతో ఉరిశిక్ష అమలుకు ఆటంకం ఎదురైంది. కారాగార నిబంధనల ప్రకారం.. ఒకటికంటే ఎక్కువ దోషులు ఉన్నప్పుడు ఒకరు క్షమాభిక్ష పెట్టుకున్న శిక్ష అమలు చేయడం కుదరదు. అలా జనవరి 22న వేయాల్సిన ఉరి తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే తాజాగా ముఖేశ్‌ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి కొట్టివేయడంతో ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీ ఖరారు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!